ముమ్మారు తలాక్ చట్టంపై మరో మారు రాజకీయ దుమారం రేగింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ముమ్మారు తలాక్ చట్టాన్ని రద్దు చేస్తామని మైనార్టీ సదస్సులో అఖిల భారత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుష్మితా దేవ్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై భాజపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
" ముమ్మారు తలాక్ చట్టాన్ని మేం వ్యతిరేకించాం. ఎందుకంటే మోదీ దీన్ని ఆయుధంగా తీసుకొచ్చారు. ఆ ఆయుధాన్ని ముస్లిం పురుషులను జైళ్లలో పెట్టడానికి, పోలీస్ స్టేషన్లలో నిలబెట్టడానికి వినియోగించనున్నారు. దేశనలుమూలల నుంచి కోట్లాది మంది ముస్లిం మహిళలు తలాక్ చట్టానికి వ్యతిరేకంగా లేఖలు రాశాలు. ఉద్యమం చేశారు. కాంగ్రెస్ పార్టీ వారి స్వరాన్నే పార్లమెంటులో వినిపించింది. నేను హామీ ఇస్తున్నా. 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. మేం ముమ్మారు తలాక్ చట్టాన్ని రద్దు చేస్తాం. కానీ మహిళల సాధికారత కోసం ఏ ప్రభుత్వం ఏ చట్టం తీసుకొచ్చినా కాంగ్రెస్ పార్టీ మద్దతిస్తుంది."
-- సుష్మితా దేవ్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు
సుష్మితా దేవ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర. కాంగ్రెస్ పార్టీని ముస్లిం మహిళలు, దేశ ప్రజలు క్షమించరంటూ విరుచుకుపడ్డారు. సుప్రీం కోర్టు తీర్పును ధిక్కరిస్తారా అంటూ రాహుల్ గాంధీని ప్రశ్నించారు.
"ముమ్మారు తలాక్ చట్టంపై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ వైఖరిని దేశం గమనిస్తోంది. ఇష్టమొచ్చిన్నట్టు మాట్లాడుతున్నారు. అధికారంలోకి వస్తే సుప్రీం కోర్టు తీర్పును పట్టించుకోబోమని చెబుతున్నారు. ఆర్డినెన్స్‌ను రద్దు చేస్తామంటున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరిస్తూనే ప్రధాని మోదీ ముమ్మారు తలాక్ బిల్లును తెచ్చారు. "
-- సంబిత్ పాత్ర, భాజపా అధికార ప్రతినిధి