రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా సొంత జిల్లా తూర్పుగోదావరికి వచ్చిన పిల్లి సుభాష్ చంద్రబోస్కు వైకాపా అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాకినాడ పట్టణ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పి.గన్నవరం ఎమ్మెల్యే కొండెపూడి చిట్టిబాబు, రామచంద్రపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, అమలాపురం ఎంపీ చింతా అనురాధలు...జిల్లా ముఖద్వారం రావులపాలెంలో ఆయనకు స్వాగతం పలికారు.
అనంతరం విలేకరులతో మాట్లాడిన మంత్రి సుభాష్ చంద్రబోస్...అవినీతి రహిత పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. టెండర్ల ప్రక్రియను పారదర్శంగా మారుస్తామని హామీఇచ్చారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తామన్నారు. హామీల నెరవేర్చే విషయంలో ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని...ఆర్థికవేత్తలు, నిపుణుల సలహాలు తీసుకుంటామని మంత్రి అన్నారు. గత ప్రభుత్వంలో 1100 జీవోలు విడుదలయ్యాయన్న మంత్రి...వాటిని రహస్యంగా ఉంచారని విమర్శించారు. వైకాపా ప్రభుత్వం దాపరికాలు లేని పాలన అందిస్తుందన్నారు.
మీడియా సమావేశం అనంతరం మంత్రి రాజమహేంద్రవరం మీదుగా రామచంద్రపురం వెళ్లారు. వైకాపా అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా ఆయనను అనుసరించారు.
ఇవీ చూడండి : రెండు, మూడు రోజుల్లో రాష్ట్రానికి రుతుపవనాలు