ఓట్ల లెక్కింపు సందర్భంగా ప్రతి ఓటూ నిష్పక్షపాతంగా, పక్కాగా లెక్కించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపుపై... రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందితో సచివాలయంలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియ సమర్ధంగా నిర్వహించిన సిబ్బందిని అభినందించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా పోలింగ్ శాతం పెరిగిందని చెప్పారు. యువత ఓటింగ్ శాతంలో కూడా 3 శాతం వృద్ధి కనిపించిందని వెల్లడించారు. అదే స్పూర్తితో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కూడా పూర్తిచేయాలన్నారు.
25వేల సిబ్బందితో ఓట్ల లెక్కింపు
ఓట్లలెక్కింపు కోసం మొత్తం 25 వేల మంది సిబ్బంది, సేవలు అందించేందుకు సన్నద్ధమవుతున్నట్లు ద్వివేది తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన తెలిపారు. చిన్నచిన్న సమస్యలు ఉత్పన్నమైనా వెంటనే పరిష్కారం కనుగొనాలని సూచించారు. కౌంటింగ్ ఏజంట్లు కూడా అన్ని విషయాలపై అవగాహనతో ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటారని, అధికారులు జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పారు.
కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత
వీవీప్యాట్ ఓట్ల లెక్కింపులో ఒక నియోజకవర్గ పరిధిలో ర్యాండమ్‌గా 5 కేంద్రాలు ఎంపిక చేస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రతను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రౌండ్ల వారీ ఫలితాలను వెల్లడించేందుకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ అడ్రెసింగ్ వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు చెప్పారు. లోక్ సభ, శాసనసభలకు సంబంధించి బ్యాలెట్ బాక్సులు తీసుకువచ్చే సిబ్బందికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు.