నెల్లూరు కేంద్రకారాగారంలో జీవిత ఖైదు శిక్ష అనుభవిస్తోన్న తన సోదరుడు గని శ్రీనివాసులను 2018 జనవరి 23న ప్రభుత్వం జారీ చేసిన జీవో 8లోని నిబంధన అనుసరించి విడుదల చేయాలని గని పవన్ కుమార్ అధికారులను అభ్యర్థించారు. సోదరుడి విడుదలకు అధికారులు నిరాకరించినందున పవన్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం శ్రీనివాసులు ప్రత్యేక క్షమాబిక్షకు అర్హుడని తేల్చింది. తక్షణం విడుదల చేయాలని ఈ ఏడాది ఏప్రిల్ 9న అధికారులను ఆదేశించింది. కోర్టు ఉత్తర్వుల మేరకు శ్రీనివాసులను విడుదల చేయకపోవటంతో పవన్ కుమార్ అధికారులపై కోర్టు ధిక్కరణ వ్యాజ్యం వేశారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ..ఎన్నికల కోడ్ కారణం చూపుతూ శ్రీనివాసులును చేయలేదని కోర్టుకు తెలిపారు. లీగల్ నోటీసులిచ్చినా పట్టించుకోలేదన్నారు. ఆ వివరాల్ని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులకు ఎన్నికల కోడ్ ఎలా వర్తిస్తుందని ప్రశ్నించింది. శ్రీనివాసులును వెంటనే విడుదల చేయాలని ఆదేశించింది. అక్రమ నిర్బంధంలో ఉంచినందుకు పరిహారం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ ఘటనకు బాధ్యులైన అప్పటి హోంశాఖ కార్యదర్శి అనురాధ, జైళ్ల శాఖ డీజీ వినయ్ రంజన్, నెల్లూరు కేంద్ర కారాగార సూపరింటెండెంట్ రవికిరణ్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
ఇదీ చదవండి : హోదాపై గళమెత్తండి: ఎంపీలతో చంద్రబాబు