Precautions to Avoid Tiger Attack : పొరుగు రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి వస్తున్న పులులు మనుషులు ప్రాణాలను హరించి వేస్తుండటంతో ప్రజలు జంకుతున్నారు. వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న వాసులకు పంట చేలకు వెళ్తేనే ఉపాధి. ప్రస్తుతం పత్తి ఏరే సమయం కావడంతో కూలీలకు బాగా డిమాండ్ ఉంటుంది. ఎత్తుగా పెరిగిన పత్తి మొక్కల్లో ఏ మూలాన ఏ మృగం ఉందో తెలియదు. అది వచ్చి మాటువేసి పైకి వచ్చి దాడి చేసే దాకా తెలియదు.
ఏటా నవంబర్ నుంచి జనవరి వరకు వ్యాఘ్రాలు జతకట్టే సమయం. తోడును వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు పయనిస్తుంటాయి. ఈ సమయంలో పులులు హార్మోన్ల అసమతుల్యం వల్ల గతి తప్పి ప్రవర్తిస్తాయని, అందుకే ప్రజలు వాటి కంట పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అటవీ శాఖ అధికారులు సూచిస్తున్నారు. రక్షణ పద్ధతులు పాటించి పులుల దాడుల నుంచి ప్రాణాలు కాపాడుకోవాలని చెబుతున్నారు.
- వన్య ప్రాణుల నుంచి పంటలను కాపాడుకునేందుకు రైతులు రాత్రి వేళల్లో చిన్న గుడారం లేదా టెంట్ వేసుకుంటారు. ప్రస్తుతం ఈ సమయంలో పులుల కదలికలు ఎక్కువగా ఉంటాయి. అందుకు ఇలా ఉండకపోవడమే శ్రేయస్కరం. తప్పనిసరిగా మంచె వేసుకుని, దానిపై ఉంటే ఉత్తమం. వ్యాఘ్రాలు ముఖ్యంగా ఉదయం 6 గంటల సమయంలో, సాయంత్రం 6 గంటల తర్వాత ఎక్కువగా తిరుగుతుంటాయి. ఈ సమయంలో కంటే ముందే చేను నుంచి ఇంటికి వెళ్లిపోవాలి. రైతులు పంట చేలకు వెళ్లే సమయంలో 8 నుంచి 10 మంది గుంపులుగా, చేతిలో తప్పనిసరిగా కర్రను తీసుకెళ్లాలి.
- గొర్రెలు, పశువుల కాపరులు జీవాలను మేత కోసం అడవికి తీసుకెళ్తుంటారు. వీరు ఉదయం 10 గంటల తర్వాత అటవీ ప్రాంతానికి చేరుకుని, 4 గంటల్లోపే ఇంటికి చేరుకోవాలి.
- చేన్లలో పని చేస్తున్నప్పుడు కాపరులు, రైతులు, తప్పనిసరిగా తల వెనుక భాగంలో మాస్కులు (మనిషి ఆకారంలో ఉండేవి) ధరించాలి.
- పత్తి ఏరుతున్న సమయంలో 8 నుంచి 10 మంది ఉండాలి. అందులో ఇద్దరు వ్యక్తులు కాపలా కాయాలి. వీరిద్దరూ ఈలలు, డప్పులు, ఇతర పరికరాలతో చప్పుడు చేస్తుండాలి. అటవీ మార్గాల నుంచి కాకుండా ఇతర దారుల్లో అన్నదాతలు తమ చేన్లకు వెళ్లడం మంచిది.
- పులి కనిపించినా, అడుగులు ఉన్నా వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించాలి. పులి ఎదురైతే దాని కళ్లల్లోకి చూస్తూ చేతులు పైకి ఎత్తి వెనక్కి నడవాలి. అస్సలు పరుగెత్తకూడదు. గట్టిగా అరవాలి. వంగి పని చేస్తుంటే జంతువు అనుకుని దాడి చేసే అవకాశం ఉంది.
- తనకు హాని చేస్తారని అనిపించడం, ఆకలి, గందరగోళం సృష్టిస్తేనే పులి దాడి చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
పులిని పరిగెత్తించిన మహిళ - భర్తను కాపాడుకోవడానికి ధైర్యసాహసాలు