తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో దొర్లిన తప్పులు ఎన్నో విధాలుగా విద్యార్థుల మెడకు చుట్టుకుంటున్నాయి. ఎంపీసీ, బైపీసీలోని ప్రధాన సబ్జెక్టులైన గణితం, భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాల్లో అత్యధిక మార్కులు వస్తాయని భావించిన ప్రతిభావంతులైన విద్యార్థులు సైతం ఇంటర్లో కొన్ని సబ్జెక్టుల్లో తప్పారు. ముఖ్యంగా గణితం-2 బీ, భౌతికశాస్త్రం సబ్జెక్టులో ఎక్కువ మంది తప్పినట్లు అంచనా. వేల మంది విద్యార్థులు... వారికి వచ్చిన మార్కులు చూసి ఖంగు తిన్నారు. 80-90 శాతంపైగా మార్కులు వస్తాయని ధీమాగా ఉన్నవారు 60 శాతానికి పరిమితం అయ్యారు. ఇదే విషయాన్ని తెలంగాణ ఇంటర్ బోర్డుకు వస్తున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు చెబుతూ ఎంసెట్లో ఈసారి వెనుకబడతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ భాషా సబ్జెక్టులను మినహాయిస్తే మిగిలిన ప్రధాన సబ్జెక్టుల్లో 600 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఈ 600 మార్కులకు ఎంసెట్లో 25 శాతం వెయిటేజీ ఉంటుంది. అంటే 600 మార్కులను 25 శాతానికి కుదిస్తారు. ఆ ప్రకారం ఇంటర్ సబ్జెక్టుల్లో ప్రతి 24 మార్కులకు ఒక మార్కు చొప్పున ఎంసెట్లో కలుపుతారు. ఎంసెట్లో 160 మార్కులకు 75 శాతం వెయిటేజీ ఇస్తారు. అంటే ఎంసెట్లో వచ్చిన మార్కులను 75 శాతానికి తగ్గిస్తారు. ఎంసెట్ లో 75 శాతం ఇంటర్లో 25 శాతం మొత్తం వంద శాతానికి వంద మార్కులు చూసి ర్యాంకు లెక్కిస్తారు.
ఎంసెట్లో 160కి 120 మార్కుల వరకు తెచ్చుకున్న విద్యార్థులకు పెద్దగా ర్యాంకుల్లో తేడా ఉండదని నిపుణులు చెబుతున్నారు. ఎంసెట్లో తక్కువ మార్కులు వచ్చే కొద్దీ... ప్రతి మార్కు కీలకమవుతుంది. ఒక్కో మార్కు తేడాతో... ర్యాంకు ఎక్కడికో కిందకు పోతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎంసెట్‌లోనే కాకుండా ఇతర గ్రూపుల వారికి డిగ్రీ ప్రవేశాలలో నష్టం జరగనుంది. గత మూడు సంవత్సరాలుగా డిగ్రీ కళాశాలలో ప్రవేశాలు దోస్త్ ద్వారా జరుగుతున్నాయి. ఆ ప్రకారం ఇంటర్లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్‌ను బట్టి కళాశాలల్లో ప్రవేశం కల్పిస్తారు. దాంతో ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ గ్రూపుల విద్యార్థులకు సైతం ఇంటర్లో మార్కులు తగ్గితే కొంత నష్టం తప్పదని విశ్లేషకుల అభిప్రాయం.
ఇవీ చూడండి: