బతికేందుకు పింఛన్లు ఆశ కల్పించే విధంగా ఉండాలని ముఖ్యమంత్రి జగన్.. కలెక్టర్లతో సదస్సులో వ్యాఖ్యానించారు. వాటి జారీలో కఠిన నియమాలు వద్దని కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో ఉదారతతో వ్యవహరించాలన్నారు. పేదల విషయంలో సానుకూలంగానే ఉండాలని జగన్ తేల్చి చెప్పారు. నాలుగు చక్రాల వాహనాలు ఉన్న వారికి పింఛను నిరాకరిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయని... వాటిని ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఆటోలు, కార్లను అద్దె లెక్కన తోలుకుని బతుకుతున్న వారికి పెన్షన్లు ఇవ్వాలని జగన్ స్పష్టం చేశారు.
తలసేమియా, కిడ్నీ లాంటి తీవ్ర వ్యాధులతో బాధపడే వాళ్లే కాకుండా పక్షవాతం, కుష్టువ్యాధిగ్రస్తులకూ నెలకు 10 వేల రూపాయలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని సీఎం చెప్పారు. మెడికల్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని జగన్ అన్నారు. వైఎస్సార్ అభయ హస్తం కింద లబ్ధిదారులకు ఇచ్చే 500 రూపాయలు.. వాళ్లు కట్టుకున్న డబ్బులేనన్న జగన్... వారికి పింఛన్లు నిరాకరించడం సరికాదన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు ఒక జట్టుగా పనిచేయాలని సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి : తిరుమలకు జమ్మలమడుగు ఎమ్మెల్యే పాదయాత్ర