సౌర, పవన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించాలని భావిస్తున్న ప్రభుత్వం.. వాటిని అధ్యయనం చేసి సిఫార్సులు చేసేందుకు ఓ ఉన్నతస్థాయి సంప్రదింపుల కమిటీ ఏర్పాటు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇద్దరు మంత్రులు సహా 9 మందితో ఓ ఉన్నత స్థాయి సంప్రదింపుల కమిటీ నియమిస్తూ ఇంధన శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కమిటీ సౌర, పవన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు సమీక్షించి ప్రభుత్వానికి సిఫార్సులు చేయనుంది. ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డితోపాటు రాష్ట్ర అడ్వకేట్ జనరల్ , ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లం, ఆర్ధికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ , ఇంధన శాఖ కార్యదర్శి నాగులాపల్లి శ్రీకాంత్, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి దువ్వూరి కృష్ణ, ఏపీ ఎస్పీడీసీఎల్ మాజీ సీఎండీ గోపాల్ రెడ్డి, ఏపీ ట్రాన్స్ కో సీఎండీలు కన్వీనర్లుగా ఈ కమిటీని నియమించారు. మార్కెట్‌లో తక్కువ ధరకు సౌర, పవన విద్యుత్ లభిస్తున్నా ఎక్కువ ధరకు ఒప్పందాలు చేసుకోవటంపై సమీక్ష చేసి ప్రభుత్వానికి కమిటీ సిఫార్సులు చేయనుంది. రాష్ట్రంలోని 2 విద్యుత్ పంపిణీ సంస్థలకు సౌర, పవన విద్యుత్‌లను విక్రయిస్తున్న కంపెనీలతో సంప్రదించి తక్కువ ధర విద్యుత్ సరఫరా అయ్యేలా చూడటంతోపాటు సమీప భవిష్యత్తులో విద్యుత్ ధరలు, ఒప్పందాలకు సంబంధించి మెరుగైన సిఫార్సులను చేసేలా ఈ కమిటీ కార్యాచరణ ఉండనుంది. దేశంలో ఎక్కడెక్కడ సౌర, పవన విద్యుత్ ధరలు తక్కువగా ఉన్నాయో పరిశీలించి వాటిన ప్రామాణికంగా తీసుకుని పీపీఏలను సమీక్షించాలని ప్రభుత్వం ఈ ఉన్నత స్థాయి కమిటీకి సూచించింది. అదే సమయంలో ఏపీ జెన్‌కో ఉత్పత్తి కేంద్రాలు, రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్‌కు యూనిట్ ధరకు ఎంత ఖర్చు అవుతోందన్న అంశాలనూ ఈ కమిటీ పరిశీలించి తదుపరి సిఫార్సులు చేయనుంది
ఇదీ చదవండి : రేపటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన