వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపు అంటే ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించారు. ఎన్నికల ముందు కావాలనే ఐటీ దాడులు చేయించారని మండిపడ్డారు. పలు చోట్ల ఈవీఎంలు మొరాయించాయని అధికారులే ఒప్పుకున్నారన్నారు. ఐపీ అడ్రస్‌లు ఇవ్వకపోతే ఫారం-7పై వైకాపా నేతల ఫిర్యాదులు ఎందుకు తీసుకున్నారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ఇంత డబ్బు ఎప్పుడూ ఖర్చు చేయలేదనీ.. 2వేల నోటు ఎందుకు తెచ్చారో ప్రజలకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.
దొంగలకు కాపలా కాస్తున్నారు
మోదీ అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారని సీఎం విమర్శించారు. దొంగలకు కాపలాకాసే పరిస్థితికి వచ్చారని ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ అతిపెద్ద తప్పులన్నారు. ఎన్నికల కోసం, మీ స్వార్థం కోసం దేశాన్ని నాశనం చేస్తారా అని దుయ్యబట్టారు. మోదీ, అమిత్‌షా కంటే ఎవరైనా ప్రధానిగా బాగా పని చేయగలరని స్పష్టం చేశారు. ఈవీఎంలోని ఓట్లు, వీవీ ప్యాట్ స్లిప్పులను ట్యాలీ చేయాలన్నారు.
ఎన్నికల నిర్వహణపై చైతన్యం తెస్తాం
సీఎస్, ఎస్పీలను బదిలీ చేస్తే మాజీ ఐఏఎస్‌లు ఎందుకు మాట్లాడలేదన్నారు. వారు వ్యక్తిగత అజెండాతోనే ఫిర్యాదు చేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై దేశవ్యాప్తంగా చైతన్యం తెస్తామని వివరించారు. ఉన్నతాధికారుల పని మొక్కలు నాటడం కాదనీ.. ఎన్నికలు సక్రమంగా నిర్వహించడమేనని చురకలంటించారు. హైదరాబాద్‌లో కూర్చుంటే రాష్ట్రంలో సమస్యలు తెలియవనీ... ఐదేళ్లు కష్టపడిన మాకు ఇక్కడి కష్టమేంటో తెలుస్తుందన్నారు.
ఈనెల 19న రాయచూర్‌లో రాహుల్‌గాంధీ, కుమారస్వామిలతో కలిసి బహిరంగసభలో పాల్గొననున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.
ఇవీ చదవండి..