ఐటీ గ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్థ కేసులో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే సంస్థ కార్యాలయంలో తనిఖీలు చేసి హార్డ్ డిస్క్‌లు, పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ ప్రజల వ్యక్తిగత, సున్నితమైన సమాచారం ఉన్నట్లు గుర్తించారు. సంస్థ సంచాలకులు అశోక్‌పై కేసు నమోదు చేసి... నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ సమాచారాన్ని భద్రపరిచిందన్న కారణంగా అమెజాన్ సంస్థకు కూడా నోటీసులిచ్చారు.
ఏపీ ఓటర్లకు చెందిన వ్యక్తిగత సమాచారాన్ని దొంగతనం చేసి దాన్ని సేవామిత్ర అనే అప్లికేషన్లో పొందుపరుస్తున్నారని మాదాపూర్ పోలీసులకు తుమ్మల లోకేశ్వర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఐటీ గ్రిడ్ సాఫ్ట్ వేర్ సంస్థపై ఐపీసీ, ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అయ్యప్ప సొసైటీలోని ఐటీ గ్రిడ్ కార్యాలయంలో రెండు రోజుల పాటు తనిఖీలు నిర్వహించారు. ఆ సంస్థకు చెందిన నలుగురు యువకులను విచారించారు. వాళ్లు ఇచ్చిన సమాచారంతో పాటు... కార్యాలయంలో స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్, ల్యాప్‌టాప్‌లను విశ్లేషించారు. ఐటీ గ్రిడ్ సంస్థ నిబంధనలను ఉల్లంఘించినట్లు నిర్ధరించుకున్నారు.
ప్రజలకు చెందిన ఆధార్ కార్డు, ఓటర్ గుర్తింపు కార్డు, ప్రభుత్వ పథకాల సమాచారం, ఏ పార్టీకి ఓటేయనున్నారనే సున్నితమైన సమాచారం ఐటీ గ్రిడ్ సాఫ్ట్వేర్ సంస్థ వద్ద ఉన్నట్లు గుర్తించారు. తెదేపాకు సేవా మిత్ర అనే మొబైల్ అప్లికేషన్‌ను రూపొందించి ఇచ్చి... అందులో ఈ సమాచారమంతా పొందుపరిచినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఐటీ గ్రిడ్ సంస్థకు ఈ సమాచారం ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో ఆరా తీస్తున్నారు. వైజాగ్‌కు చెందిన బ్లూఫ్రాగ్ అనే సాఫ్ట్వేర్ సంస్థకు, ఐటీ గ్రిడ్ సంస్థకు వ్యాపార సంబంధాలున్నట్లు పోలీసులు గుర్తించారు. సంస్థ సంచాలకులు అశోక్ పై కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకుంటే మరింత సమాచారం బయటపడుతుందని అశోక్ కోసం గాలిస్తున్నారు.
ఫిబ్రవరి 23న అశోక్‌ను పిలిచి సీసీఎస్ పోలీసులు ప్రశ్నించినట్లు సమాచారం. అప్రమత్తమైన అశోక్ ఫిబ్రవరి 27న తన కార్యాలయ కంప్యూటర్లలోని కీలక సమాచారం తొలగించినట్లు గుర్తించారు. ఆ డేటాను తిరిగి సంపాదించేందుకు తెలంగాణ పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.