కర్నూలు జిల్లా పాణ్యం మండలం కౌలూరులో విషాదం జరిగింది. రైలు కిందపడి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు పిల్లలతో పాటు దంపతులు మరణించారు. నంద్యాల నుంచి ఆటోలో వచ్చిన వారు అత్మహత్యకు పాల్పడ్డారు.
సంతోషంగా ఉన్న చిన్న కుటుంబం. ఓ చోరీ కేసు ఆ కుటుంబంలో చిచ్చురేపింది. ప్రశాంతతను దూరం చేసింది. దైర్యాన్ని కోల్పోయేలా చేసి.. ఆత్మహత్యకు పురిగొల్పింది. ఎంతో దయనీయంగా.. అనామకంగా.. గూడ్సు రైలు కింద పడి.. ప్రాణాలు తీసుకునేలా చేసింది.
కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మూలసాగరానికి చెందిన అబ్దుల్ సలాం ఓ బంగారు దుకాణంలో గుమస్తాగా పనిచేసేవారు. భార్య నూర్జహాన్ ప్రైవేటు స్కూల్లో టీచర్. అదే పాఠశాలలో కుమార్తె సల్మా తొమ్మిదో తరగతి, కుమారుడు దాదా కలాందర్ ఆరో తరగతి చదువుతున్నారు. 2019 నవంబర్ నెలలో ఆభరణాల దుకాణంలో బంగారం చోరీ జరిగింది. అబ్దుల్ సలామే మూడు కిలోల బంగారం అపహరించారని.. యజమాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది. పోలీసులు విచారించి.. 500 గ్రాముల బంగారాన్ని రికవరీ చేశారు. 42 రోజులు రిమాండ్లో ఉండి.. ఈ మధ్యనే ఇంటికి వచ్చారు. నంద్యాలలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. రాత్రి ఆటోలో 70 వేలు నగదు చోరీకి గురైందని.. పోలీసులకు ఫిర్యాదు అందింది. గతంలో బంగారం చోరీ కేసులో నిందితుడుగా ఉన్న అబ్దుల్ సలాం ఆటో అని గుర్తించి.. పోలీసులు విచారించారు.
ఓ వైపు బంగారు ఆభరణాల చోరీ కేసు, మరోవైపు రాత్రి జరిగిన ఘటన, గతంలో రిమాండ్ లో విచారణను.. తలచుకుని.. రాత్రంతా నిద్రలేకుండా గడిపారు. ఇలా బాధపడడం కంటే.. మరణించటమే మేలని కుటుంబ సభ్యులతో చెప్పారు. తాను లేకుండా వారు బతకలేమన్నారు. ఉదయం స్కూలుకు వెళుతున్నామని చెప్పి.. అందరూ కలిసి ఆటోలో పాణ్యం మండలం కౌలూరుకు వెళ్లారు. రైల్వేట్రాక్ సమీపంలో ఆటో ఆపారు. అందరూ కలిసి గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
పోలీసుల వేధింపుల వల్లే తన కుమార్తె కుటుంబం ఆత్మహత్య చేసుకుందని అబ్దుల్ సలాం అత్త ఆరోపించింది. రైల్వే ట్రాక్ పై శరీర భాగాలు తెగిపోయి చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. సంతోషంగా ఉన్న కుటుంబం.. ఒక్క ఘటనతో.. విగతజీవులుగా మారారు.
ఇదీ చదవండి: