ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణ(87) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. ఫిల్మ్‌నగర్‌లోని తన నివాసంలో ఈ వేకువజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో సత్యనారాయణ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. కైకాల మృతితో చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. నిర్మాత అల్లు అరవింద్, నందమూరి బాలకృష్ణ, కల్యాణరామ్, దర్శకుడు కె.రాఘవేంద్రరావు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కైకాల కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
కైకాల మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. "ప్రసిద్ధ సినీ దిగ్గజం శ్రీ కైకాల సత్యనారాయణ మృతి పట్ల చింతిస్తున్నాను. విభిన్న పాత్రలతో అద్భుతమైన నటనా చాతుర్యంతో అనేక తరాల ప్రేక్షకులకు ఆయన చిరపరిచితులు. వారి కుటుంబసభ్యులకు,అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి." అని ట్వీట్ చేశారు.
దిగ్భ్రాంతి కలిగించింది: బాలకృష్ణ
కైకాల సత్యనారాయణ మరణం దిగ్భ్రాంతి కలిగించిందని ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆరు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో పౌరాణిక, సాంఘిక, చారిత్రక, జానపద పాత్రల్లో నవరస నటనా సార్వభౌముడిగా తన వైవిధ్యమైన నటనతో అలరించారని కొనియాడారు. కైకాల కుటుంబానికి బాలకృష్ణ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మృతి విచారకరం: నారా లోకేష్
సీనియర్ నటులు, మాజీ ఎంపీ, నవరస నటనా సార్వభౌమ కైకాల సత్యనారాయణ గారి మృతి విచారకరం. విలక్షణ నటనతో విభిన్న పాత్రలకు జీవం పోసిన ఆయన మరణం సినీ పరిశ్రమకు తీరని లోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను
అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ.. విభిన్నపాత్రల్లో నటించి, తన విలక్షణ నటన ద్వారా అభిమానులచేత నవరసనటనాసార్వభౌమ అనిపించుకున్న మేటి నటులు, టీడీపీ మాజీ పార్లమెంటు సభ్యులు కైకాల సత్యనారాయణ గారి మరణం విచారకరం. సత్యనారాయణగారి ఆరు దశాబ్దాల సినీ జీవితంలో ఎన్టీఆర్ గారితో ఆయనకున్న అనుబంధం సొంత అన్నదమ్ముల బంధం కన్నా ఎక్కువ. ఆయన మరణం సినీరంగానికి తీరని లోటు. ఆయన ఆత్మ శాంతికై ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఏనాడూ వివాదాల జోలికి వెళ్లకుండా.. కైకాల సత్యనారాయణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు అన్నారు. కైకాల పార్థివదేహానికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. సత్యనారాయణ నటించని పాత్రలు లేవన్నారు. భావోద్వేగ పాత్రల్లో నటిస్తే కన్నీళ్లు తెప్పించేవారని గుర్తు చేసుకున్నారు. ఏనాడూ వివాదావ జోలికి వెళ్లకుండా అందరితో స్నేహంగా ఉండేవారని చెప్పారు. కైకాల అజాత శత్రువని రాఘవేంద్ర రావు కొనియాడారు.
"సత్యనారాయణ గారి అకాల మరణ వార్త నన్ను కలచివేసింది. సినీ పరిశ్రమకు ఆయన అందించిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా" - రామ్‌చరణ్
"తెలుగు సినీ పరిశ్రమలో నేను అభిమానించే నటుల్లో ఒకరైన కైకాల సత్యనారాయణ మరణం నా హృదయాన్ని ముక్కలు చేసింది. మన ఇంట్లో మనిషిలా ఆయన అందరితో కలిసిపోయేవారు. సినిమాల్లో ఆయన నటన అద్భుతం. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా" - నాని
"చిత్ర పరిశ్రమ మరో లెజెండ్‌ను కోల్పోయింది. నవరస నటనా సార్వభౌమ అనే బిరుదు ఆయనకు సరిగ్గా నప్పేది. ఎన్నో అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆయన్ని వెండితెరపై మిస్ అవుతాం. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా" - శ్రీను వైట్ల