ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. కాసేపట్లో జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. దేశంలో కరోనా వైరస్ విజృంభణ, ఈ నెల 17తో లాక్డౌన్ ముగియనున్న నేపథ్యంలో మోదీ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ద్విముఖ వ్యూహంపై ప్రకటన!
దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో లాక్డౌన్ పొడిగింపు అనివార్యం అని తెలుస్తోంది. ఇదే విషయంపై సోమవారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని భేటీ అయ్యారు. దాదాపు 6 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో లాక్డౌన్ పొడిగించాలంటూ పలువురు ముఖ్యమంత్రులు మోదీని అభ్యర్థించారు. అనంతరం వివిధ అంశాలపై చర్చించారు.
ప్రజల ప్రాణాలను కాపాడుతూనే, ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు మోదీ. అందుకు అనుగుణంగా చేపట్టనున్న చర్యల్ని మోదీ వెల్లడించే అవకాశముంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా దశల వారీగా అనేక ఆర్థిక కార్యకలాపాలకు అనుమతులిస్తోంది ప్రభుత్వం.
వలస కూలీల కష్టాలపై...
వలస కూలీల వ్యవహారంపై ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది. పలువురు కూలీలు రైలు ప్రమాదంలో మృతి చెందడం, మరికొంత మంది స్వస్థలాలకు నడిచి వెళుతూ మరణించడంపై ప్రధాని ప్రస్తావిస్తారని సమాచారం.
వలస కూలీలను తమ ప్రాంతాలకు వెళ్లేందుకు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. మరికొన్ని రాష్ట్రాలు వచ్చిన వారి విషయంలో అలసత్వం ప్రదర్శించడంపై ప్రధాని అసంతృప్తి గా ఉన్నట్లు సమాచారం. దీనితోపాటు పలు చోట్ల లాక్డౌన్ నిబంధనలు అమలులో ప్రజలు ఇష్టా రీతిలో వ్యవహరించడం పై కూడా ప్రధాని మాట్లాడే అవకాశం ఉంది.