దిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఆక్సిజన్ స్థాయిలు తగ్గటం వల్ల ఐసీయూకు తరలించినట్లు అధికారవర్గాలు తెలిపాయి. ఈనెల 17న దిల్లీ వైద్య శాఖ మంత్రి జైన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆ మరుసటిరోజు తీవ్రమైన జ్వరం, ఆక్సిజన్ స్థాయిలు దారుణంగా పడిపోవటం వల్ల రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు.
ఆరోగ్యం మెరుగుపడుతుందని వైద్యులు ప్రకటించిన మరుసటిరోజే ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ పెరిగినట్లు గుర్తించారు. ఈ మేరకు దిల్లీ వైద్య శాఖ మంత్రి కార్యాలయం ఓ ప్రకటన చేసింది. ప్రత్యేక వైద్యుల బృందం.. జైన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్నట్లు పేర్కొంది.
సత్యేంద్ర జైన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.