ఒక ముస్లిం యువకుడు తాను కొన్న పొలంలో తొలిసారి పండించిన పంటను హిందూ మఠానికి అందజేసి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. తన విశాల దృక్పథంతో కులమతాలకతీతంగా ఆలోచించి రూ.30,000 విలువైన.. 16 క్వింటాళ్ల పంటను మఠానికిచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు.
కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా గంగావతికి చెందిన మెహబూబ్ పాషా.. కనకగిరి సమీపంలోని లక్కుంపి గ్రామంలో ఇటీవల మూడెకరాల భూమిని కొనుగోలు చేశాడు. రెండు ఎకరాల్లో సజ్జలను సాగు చేయగా 1600 కిలోల దిగుబడి వచ్చింది. ఆ మెుత్తాన్ని అతడు కొప్పాల్లోని నిత్యం అన్నదానం జరిగే.. గవి మఠానికి అందజేశాడు.
తాను సాగు చేసిన పంటను ఏదైనా మంచి పనికి వినియోగించాలనుకున్న పాషా.. వ్యాపారవేత్త ఆనంద్ అక్కిని సలహా అడిగాడు. ఏ మఠానికిచ్చినా.. మీ సంకల్పం నెరవేరుతుందని ఆయన సూచించగా కొప్పాల్లోని గవి మఠానికి తీసుకెళ్లి అందజేశాడు. యువకుడి దాతృత్వాన్ని మెచ్చిన గవి మఠం అభినవ గవి సిద్దేశ్వర స్వామీజీ అతడ్ని సత్కరించారు.