Wrestlers meet Amit Shah : రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్‌పై నమోదైన లైంగిక వేధింపుల కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసేలా చూడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు రెజ్లర్లు విజ్ఞప్తి చేశారు. ఆదివారం రాత్రి కేంద్ర మంత్రితో భేటీ అయిన రెజ్లర్లు.. తమ సమస్యలను ఆయనతో చెప్పుకున్నట్లు సమాచారం. అగ్రశ్రేణి రెజ్లర్లు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, సత్యవత్ కేదాన్.. అమిత్ షాతో భేటీ అయినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి వరకు సమావేశం కొనసాగిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ సమస్యపై తాను దృష్టిసారిస్తానని అమిత్ షా.. రెజ్లర్లతో చెప్పినట్లు సమాచారం. చట్టం ముందు అందరూ సమానులేనని రెజ్లర్లతో ఆయన వ్యాఖ్యానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
Brij Bhushan News : తమను లైంగికంగా వేధించిన బ్రిజ్ భూషణ్ సింగ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రెజ్లర్లు నిరసన చేస్తున్నారు. తమ సమస్యపై ఎన్నిసార్లు మాట్లాడినా ఎవరూ స్పందించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్లు 35 రోజుల పాటు ఆందోళన నిర్వహించారు. అయితే, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభం రోజు చేసిన ఉద్ధృత ఆందోళనల నేపథ్యంలో.. నిబంధనలు అతిక్రమించారని పేర్కొంటూ జంతర్‌మంతర్ వద్ద నిరసనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఈ పరిణామాల అనంతరం రెజ్లర్లు అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆమె మైనర్ కాదా?
Wrestlers protest : మరోవైపు, బ్రిజ్ భూషణ్‌పై ఫిర్యాదు చేసిన రెజ్లర్లలో ఓ మైనర్.. తన కంప్లైంట్ ఉపసంహరించుకున్నట్లు సమాచారం. పాటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసి ఫిర్యాదును విత్‌డ్రా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ బాలిక మైనర్ కాదని విచారణలో తేలిందని, ఆమెపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారని తెలిసింది. ఈ నేపథ్యంలోనే రెజ్లర్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి మేజిస్ట్రేట్ ఎదుట ఆమె స్టేట్మెంట్ను రికార్డు చేసినట్లు తెలుస్తోంది.
బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించారని రెజ్లర్లు ఆరోపిస్తున్నారు. తమను చెడుగా తాకడం, అసభ్య పదాలతో సంభాషించడం వంటివి చేసేవాడని చెబుతున్నారు. ఈ మేరకు ఆరుగురు మహిళా రెజ్లర్లు, ఓ మైనర్.. బ్రిజ్ భూషణ్‌పై కంప్లైంట్ ఇచ్చారు. దీనిపై దిల్లీ పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మైనర్‌పై లైంగిక వేధింపుల కేసులో పోక్సో చట్టం ప్రకారం ఒకటి.. ఆరుగురు మహిళా రెజ్లర్ల ఫిర్యాదుపై మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తమ దుస్తులు లాగి.. ఛాతిని తాకేవాడని ఎఫ్ఐఆర్లో రెజ్లర్లు ఆరోపించారు. తాము బృందంగా ఉన్నా.. ఒకరిని వేరుగా తీసుకెళ్లి అభ్యంతరకరమైన ప్రశ్నలు అడిగేవాడని పేర్కొన్నారు. తనతో సన్నిహితంగా ఉంటే వైద్య ఖర్చులను ఫెడరేషన్ భరించేలా చేస్తానని ఆయన అన్నట్లు ఆరోపించారు. రెజ్లర్లు ఇంకా ఏమన్నారో తెలియాలంటే లింక్‌పై క్లిక్ చేయండి.