బిహార్ ముజఫర్‌పుర్‌లోని వేశ్యావాటికలో పుట్టి పెరిగిన ఓ అమ్మాయి.. ఇప్పుడు ఏకంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సలహా బృందంలో సభ్యురాలిగా చోటుదక్కించుకున్నారు. ఆమె పేరు నసీమా ఖాతూన్. స్వస్థలం.. ముజఫర్‌పుర్‌లోని చతుర్భుజ్ స్థాన్ అనే రెడ్‌లైట్ ఏరియా. నిజానికి ఆమె తండ్రిని చతుర్భుజ్ స్థాన్‌కు చెందిన ఓ వేశ్య దత్తత తీసుకుంది. నసీమా అక్కడే పుట్టి పెరిగారు. అయితే వేశ్యావృత్తిలో మాత్రం అడుగుపెట్టలేదు.
1995లో ఆమె జీవితం కీలక మలుపు తిరిగింది. ఐఏఎస్ అధికారిణి రాజ్‌బాల వర్మ.. వేశ్యలు, వారి కుటుంబాలకు ప్రత్యామ్నాయ జీవనోపాధి మార్గాలు చూపించారు. దీంతో నసీమా కుట్లు-అల్లికలు నేర్చుకున్నారు. ప్రారంభంలో నెలకు రూ.500 సంపాదిస్తూ ఉపాధి పొందారు. ఆపై క్రమంగా మానవహక్కుల కార్యకర్తగా ఎదిగారు. పర్చమ్ అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. తాజాగా ఎన్‌హెచ్‌ఆర్‌సీ సలహా బృందంలో సభ్యురాలిగా అవకాశం దక్కించుకున్నారు.
"అణగారిన నా సమాజం ఇప్పుడిప్పుడే పురోగమిస్తుంది. వారి హక్కుల కోసం నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మా సమాజంలోని పెద్దల ఆశీస్సులు, సహచరుల ప్రేమ, ఆకాంక్షలతో జాతీయ స్థాయిలో గొప్ప బాధ్యత నాకు లభించింది. దేశంలోనే అత్యున్నత న్యాయ సంస్థ అయిన మానవ హక్కుల కమిషన్‌కు అడ్వైజరీ కోర్ గ్రూప్‌లో సభ్యురాలిగా చేరడం మంచి అవకాశంగా భావిస్తున్నాను."
-నసిమా ఖాతున్, మానవ హక్కుల కమిషన్ అడ్వైజరీ గ్రూప్ సభ్యురాలు
అయితే గత కొన్ని సంవత్సరాలుగా నసిమా ఖాతున్ రెడ్‌లైట్ ఏరియా ప్రజల హక్కుల కోసం పోరాడుతున్నారు. అక్కడ పుట్టిన ఆడబిడ్డలకు చదువు చెప్పించేందుకు కృషి చేస్తున్నారు. పార్చం ఆర్గనైజేషన్ ద్వారా వారి అభ్యున్నతికి వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. తనకు ఎన్ఎచ్ఆర్సీ అడ్వైజరీ కమిటీలో చోటు కల్పించడం చాలా గౌరవంగా భావిస్తున్నట్లు నసిమా తెలిపారు.