CJI Ramana Retirement: "నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. పదవీ విరమణకు ముందు ఎలాంటి వ్యాఖ్యలూ చేయదలచుకోలేదు. నా వీడ్కోలు ప్రసంగంలో అన్నీ చెబుతా. అప్పటివరకు వేచి ఉండండి" అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు. విచారణ జాబితాలో ఉన్న ఓ కేసును తొలగించడం గురించి సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే బుధవారం సీజేఐ దృష్టికి తీసుకువెళ్లారు. చివరి నిమిషంలో అలా తొలగించడం న్యాయవాదులకు తీవ్ర ఇబ్బందులను తెచ్చిపెడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. 'మేం ముందురోజు రాత్రి వరకు ఆ కేసును వింటాం. కక్షిదారులు, న్యాయవాదులతో ఎన్నోసార్లు మాట్లాడతాం. అంతా అయ్యాక కేసు డిలీట్ అవుతోంది. ఇది సరైన పద్ధతి కాదు. ఈ విధానాన్ని ఖండించాలి. రిజిస్ట్రీ మరింత జాగ్రత్తగా ఉండాలి' అని దుష్యంత్ దవే పేర్కొన్నారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పనితీరు గురించి ఆయన ప్రశ్నలు లేవనెత్తినప్పుడు జస్టిస్ రమణ ఈ మేరకు స్పందించారు.
ఎన్‌ఆర్‌ఐల ఓటు హక్కుపై కేంద్రం స్పందనకు ఆదేశం: మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేసే హక్కు ప్రవాస భారతీయులకూ కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం స్పందించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేరళ ప్రవాసీ సంఘం దాఖలు చేసిన పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, జస్టిస్ జె.కె.మహేశ్వరి, జస్టిస్ హిమాకొహ్లిల ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ అంశంపై పెండింగులో ఉన్న వేరే కేసుతో కలిపి దీనిని విచారించాలని నిర్ణయించింది.
ఇవీ చదవండి: కుమార్తెపై కన్నేశాడని ప్రియుడి పురుషాంగం కోసేసిన మహిళ
మోదీ అంగీకారంతోనే ఆ కేసు దోషుల్ని విడుదల చేశారా, కాంగ్రెస్ సూటి ప్రశ్న