Why Dogs Chase Bikes And Cars On Roads : మనం బైక్‌పైనో, లేదా కారులోనో వెళ్తున్నప్పుడు.. రోడ్డుపైన ఉన్న కుక్కలు వెంబడిస్తాయి. ముఖ్యంగా బైక్మీద వెళ్లేవారికి తరచూ ఈ పరిస్థితి ఎదురవుతూనే ఉంటుంది. మనం ఆ కుక్కలను ఏమి అనకపోయినా సరే.. అవి అరుస్తూ వెంట పడతాయి! మరి.. ఇందుకు గల కారణాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎందుకు వెంటపడతాయి?
కుక్కలకు వాసన గ్రహించే శక్తి చాలా అధికంగా ఉంటుంది. అవి మనుషుల వద్దకు వెళ్లినా.. లేదా వాహనాల వద్దకు వెళ్లినా.. వాసన చూడటాన్ని మనం గమనించొచ్చు. ఇతర కుక్కలను కూడా ఇలా వాసన గ్రహించి, గుర్తు పెట్టుకుంటాయట. అయితే.. మనం కారు లేదా బైక్ ఎక్కడైనా పార్క్ చేసినప్పుడు, కుక్కలు వాహనాల టైర్లపై మూత్రవిసర్జన చేస్తాయి. ఆ వాహనంపై మనం వేరే ప్రాంతాలకు వెళ్లినప్పుడు.. అక్కడి కుక్కలు దూరం నుంచే ఈ వాసన పసిగడతాయట. దాంతో.. వేరే ప్రాంతానికి చెందిన కుక్కలు తమ ప్రాంతానికి వస్తున్నాయని భావిస్తాయట. అందుకే.. ఆ వాహనం వెంట ఆరుస్తూ పరుగులు తీస్తాయని జంతు పరిశోధకులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో చాలా మంది ఆందోళన పడిపోయి.. వాహనాలను మరింత వేగంగా నడుపుతారు. దీంతో.. కుక్కల అనుమానం మరింతగా బలపడి.. వెంటాడుతాయని చెబుతున్నారు.
వేరే కుక్కలను రానివ్వవు..
సాధారణంగా ఏదైనా వీధిలోకి కొత్త కుక్కలు వస్తే.. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న కుక్కలన్నీ వాటిని తరమివేయడాన్ని మనం చూసే ఉంటాం. ఇలా ఎందుకు చేస్తాయంటే.. చాలా వరకు కుక్కలు ఒక ప్రాంతానికి లోబడి ఉంటాయట. అందువల్ల.. తమ పరిధిలోకి, ప్రాంతంలోకి వేరే కుక్కలు రావడాన్ని అంగీకరించవని చెబుతున్నారు. తమకు తెలిసిన కుక్కలతో మాత్రమే అవి కలివిడిగా ఉంటాయి. అలా కాకుండా.. కొత్త కుక్కలు వాటి ప్రాంతానికి వస్తే.. యుద్ధమే! ఇలాంటి మనస్తత్వంతో ఉండే కుక్కలకు.. కారు లేదా బైక్ టైర్ నుంచి వేరే కుక్క మూత్రం వాసన వస్తే.. తమ ప్రాంతానికి వేరే కుక్కలు వచ్చినట్లు అనుమానిస్తాయి. అందుకే కుక్కలు ఆ వాహనాల వెంటపడతాయని చెబుతున్నారు.
వింత అరుపులు..
కుక్కలు వాహనాలను వెంబడించడానకి మరో కారణం కూడా ఉందట. వాహనాల నుంచి ఏదైనా వింత అరుపులు వినిపించినప్పుడు కూడా కుక్కలు వెంబడిస్తాయి. కొంత మంది బైక్ నడుపతూ.. వింత శబ్దాలు చేస్తుంటారు. అలాంటి సందర్భాల్లో కూడా కుక్కలు వెంటపడతాయి. అదేవిధంగా.. వాహనంలో అవి తినే జంతువులు ఏవైనా ఉన్నాయని భావిస్తే కూడా.. వెంటపడతాయని పరిశోధకులు చెబుతున్నారు. కుక్కలు వెంటపడిన సమయంలో వాహనదారులు కంగారు పడకుండా.. వాహనాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తున్నారు.
డీజిల్ కారులో పెట్రోల్ పోస్తే - ఏమవుతుందో మీకు తెలుసా?
మీ కారుపై గీతలు పడ్డాయా - ఇలా ఈజీగా తొలగించండి!
Best Dog Collar GPS Trackers in Telugu : మీ ఇంట్లో కుక్కను పెంచుతున్నారా..? ఇది మీకోసమే..!