ముంబై నుంచి గాంధీనగర్ వెళ్తున్న వందే భారత్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు మరోసారి పశువును ఢీకొట్టింది. గుజరాత్‌లోని అతుల్ స్టేషన్ సమీపంలో గేదేలను ఢీకొట్టడం వల్ల రైలు 20 నిమిషాలు పాటు ఆగిపోయింది. శనివారం ఉదయం 8.20 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు అధికారులు తెలిపారు.
ఈ ఘటన వల్ల రైలు ముందు ప్యానెల్ దెబ్బతినట్లు రైల్వే అధికారులు తెలిపారు. దాంతో పాటు మొదటి కోచ్‌లోని అండర్ బెల్లీ పరికరాలు కూడా దెబ్బతిన్నట్లు చెప్పారు. నెల రోజుల వ్యవధిలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం.
"రైలుకు ఎటువంటి ఆపరేషనల్ డ్యామేజ్ జరగలేదు. 20 నిమిషాల్లో ఆగిన రైలు తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించింది. రైలులోని ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారు" అని పశ్చిమ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సుమిత్ ఠాకూర్ తెలిపారు.
గతంలో అక్టోబరు 6న ముంబై నుంచి గాంధీనగర్‌కు వెళ్తున్న వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గుజరాత్‌లోని వత్వా, మణినగర్ రైల్వే స్టేషన్ల మధ్య నాలుగు గేదెలను ఢీకొట్టింది. దాంతో ఆ గేదెలు అక్కడికక్కడే చనిపోయాయి. రైలు ముందు భాగం దెబ్బతింది. దీంతో రాత్రికి రాత్రే రైలుకు మరమ్మత్తులు చేశారు. ఇక, అక్టోబర్ 7న జరిగిన రెండో ఘటనలో గుజరాత్ నుంచి ముంబైకి వెళుతున్న రైలు ఆనంద్ సమీపంలో ఒక ఆవును ఢీకొట్టింది.