UPSC NDA notification 2023 : త్రివిధ దళాల్లో చేరి దేశానికి సేవలు చేసే అద్భుతమైన అవకాశాన్ని యువతకు అందిస్తోంది యూపీఎస్సీ. ఈ మేరకు ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సు (ఐఎన్ఏసీ)లో వందలాది ఖాళీలకు నోటిఫికేషన్ జారీ చేసింది యూపీఎస్సీ. నేషనల్ డిఫెన్స్ అకాడమీ-152వ కోర్సుకు గానూ ఈ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వింగ్స్‌లో చేరేందుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయో పరిమితి
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ)లోని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ వింగ్ కోర్సులో చేరి శిక్షణ తీసుకునేందుకు యూపీఎస్సీ ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపడుతోంది. ఈ కోర్సులకు ఎంపికైన అభ్యర్థులు శిక్షణను పూర్తి చేసుకున్నాక, వారికి కేటాయించిన వింగ్స్‌లో ఉద్యోగాల్లో చేరతారు. ఈ జాబ్స్‌కు దరఖాస్తు చేసే అభ్యర్థులు జనవరి 2వ తేదీ 2005 నుంచి జనవరి 1, 2008 సంవత్సరాల మధ్య పుట్టినవారై ఉండాలి. యూపీఎస్సీ అధికారిక నోటిఫికేషన్ ప్రకారం ఈ కోర్సులకు అప్లై చేసేవారు ఇంటర్మీడియట్ చదివి ఉండాలి లేదా 10+2కు సమానమైన కోర్సు చేసి ఉండాలి. అర్హతలు ఉన్నవారు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి జూన్ 6వ తేదీ 2023లోగా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు
Indian naval academy eligibility : యూపీఎస్సీ చేపట్టనున్న ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ ముగిశాక.. ఎంపికైన విద్యార్థులకు 2024 జూలై 2 నుంచి ఇండియన్ నేవల్ అకాడమీ కోర్సులను ప్రారంభిస్తారు. ఈసారి ఏకంగా 395 మంది విద్యార్థులను చేర్చుకోనుంది యూపీఎస్సీ. ఈ కోర్సు కోసం దరఖాస్తు చేసే విద్యార్థులు ఇంటర్మీడియట్ లేదా సమాంతరమైన 10+2 స్కూల్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌ను స్టేట్ ఎడ్యుకేషన్ బోర్డు నుంచి లేదా యూనివర్సిటీ నుంచి పొంది ఉండాలి.
ఫిట్నెస్ తప్పనిసరి
ఈ కోర్సులకు అప్లై చేసే విద్యార్థులు 12వ తరగతిలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితశాస్త్రాలను చదివి, వాటిలో ఉత్తీర్ణులై ఉండాలి. ఈ పోస్టుల దరఖాస్తుకు విద్యార్హతలతో పాటు అభ్యర్థులు శారీరకంగా ఫిట్‌గా ఉండటం కూడా తప్పనిసరి. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నేవల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2023 గైడ్‌లైన్స్ ప్రకారం శారీరక దారుఢ్యం కలిగి ఉన్నవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు అర్హులు అని గుర్తుంచుకోవాలి.