UP minister rat bitten: ఉత్తర్‌ప్రదేశ్ క్రీడల శాఖ మంత్రి గిరీష్ చంద్ర యాదవ్‌కు ఎదురైన సంఘటన అటు మంత్రికి, ఇటు అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. మంత్రి అధికార పర్యటన నిమిత్తం ఆదివారం రాష్ట్రంలోని బండా జిల్లాకు వెళ్లారు. రాత్రి బండాలోని ప్రభుత్వ అతిథిగృహంలో బస చేశారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అకస్మాత్తుగా నిద్రలేచిన మంత్రి తనను ఏదో విషపురుగు కరిచిందని.. అది పాము కావచ్చని అనుమానం వ్యక్తం చేశారు. భయపడిన అధికారులు ఆయనను అప్పటికప్పుడు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించారు. చివరకు ఎలుక కొరికిందని నిర్ధారించడంతో అక్కడున్న వారందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అతిథిగృహం చుట్టూ దట్టమైన అడవి ఉండటంతో తొలుత పాము కరిచి ఉంటుందని మంత్రి భయాందోళనకు గురయ్యారు. అదే సమయంలో సిబ్బంది అతిథిగృహంలోని అన్ని గదులు గాలించి ఎలుకను పట్టుకున్నారు. ఉదయం ఆరు గంటలకు మంత్రిని డిశ్చార్జి చేయడంతో కథ సుఖాంతమైంది.
ఇదీ చదవండి: రాజకీయ కక్షసాధింపులకు కోర్టులు వేదికలా..?: సీజేఐ