Union Minister Boat Stuck in Chilika Lake : కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలా చిలికా సరస్సులో ప్రయాణిస్తూ తప్పిపోయారు. ఒడిశా పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం సాయంత్రం చిలికా సరస్సులో ప్రయాణించారు. రెండు గంటల పాటు దారి తెలియక చిలికా సరస్సులోనే చిక్కుకుపోయారు. మత్స్యకారుల వలలో పడవ చిక్కుకొని ఉంటుందని తొలుత భావించినప్పటికీ కేంద్ర మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. దారి తప్పిపోవడం వల్లే తిరిగి రావడం ఆలస్యమైందని చెప్పారు. జిల్లా యంత్రాంగం మరో పడవను పంపించి కేంద్ర మంత్రిని ఒడ్డుకు తీసుకొచ్చింది.
మంత్రి రూపాలా ఖుర్దా జిల్లాలోని బార్కుల్ నుంచి పూరీ జిల్లాలోని సాత్‌పాడాకు పడవలో వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. సరస్సు మధ్యలో ఉండగా నల్బాణ పక్షుల అభయారణ్యం వద్ద పడవ ఆగిపోయింది. పడవ రెండు గంటలపాటు అక్కడే నిలిచిపోయిందని మంత్రి సెక్యూరిటీ అధికారి ఒకరు వివరించారు. పురుషోత్తం రూపాలా వెంట బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్ర సైతం ఉన్నారు. స్థానిక బీజేపీ నాయకులు కూడా పడవలో వెళ్లి చిక్కుకుపోయారు.
మరో పడవ పంపిన అధికారులు
పడవ నిలిచిపోయిందన్న సమాచారాన్ని పూరీలోని అధికారులకు తెలియజేశారు. వెంటనే స్పందించిన అధికార యంత్రాంగం మరో పడవను రంగంలోకి దించింది. మంత్రి చిక్కుకున్న ప్రాంతానికి వెళ్లిన పడవ అందరినీ గమ్యానికి తీసుకొచ్చింది. ఆదివారం రాత్రి 10.30 గంటలకు రూపాలా పూరీకి చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.
'దారి తెలియక తప్పిపోయాం!'
'పడవ నడిపే వ్యక్తికి ఆ దారి కొత్త. బాగా చీకటి పడేసరికి అతడు దారిని గుర్తించలేకపోయాడు. దీంతో మేం తప్పిపోయాం. సాత్‌పాడాకు చేరుకోవడానికి రెండు గంటలకు పైగా సమయం పట్టింది' అని ఒడ్డుకు చేరుకున్న అనంతరం కేంద్ర మంత్రి వివరించారు.
కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు పురుషోత్తం రూపాలా. సాగర్ పరిక్రమ పదకొండో విడత కార్యక్రమంలో భాగంగా మత్స్యకారులను కలిసేందుకు ఒడిశాలో పర్యటిస్తున్నారు. పూరీలోని కృష్ణప్రసాద్ ప్రాంతంలో ఆదివారం జరగాల్సిన ఓ కార్యక్రమానికి రూపాలా హాజరుకావాల్సి ఉంది. సరస్సులో చిక్కుకుపోవడం వల్ల ఆ కార్యక్రమాన్ని రద్దు చేశారు. అంతకుముందు, గంజాం జిల్లాలోని గోపాల్‌పుర్ హార్బర్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం పారాదీప్ ఫిషింగ్ హార్బర్ ఆధునికీకరణ పనులకు మరో కేంద్ర మంత్రి సర్బానంద సోనోవాల్‌తో కలిసి శంకుస్థాపన చేయనున్నారు.
చనిపోయాడని అంత్యక్రియలు- ఇంటికి తిరిగి వచ్చిన వ్యక్తి- అంతా షాక్
'80 ఏళ్లు దాటినా కొందరు రిటైర్ కారు- బాధ్యతలు మాకు అప్పగించొచ్చు కదా!'