కేరళ నుంచి కశ్మీర్‌కు సైకిల్‌పై బయలుదేరారు ఇద్దరు యువకులు. అయితే వీరిద్దరు ఒక ప్రాంతానికి చెందినవారు కారు. అలా అని సన్నిహితులూ కారు. కానీ వారి ఆకాంక్ష మాత్రం ఒక్కటే. అదే.. సైకిల్‌పై కశ్మీర్‌కు ప్రయాణించడం.. దారిలో వివిధ ప్రాంతాలను సందర్శించడం. అనుకోకుండా వీరి దారులు కలిశాయి. ఆ తర్వాత వీరి ప్రయాణం ఒక్కటైంది.
కొన్ని రోజుల క్రితం పాలక్కడ్ జిల్లా పట్టాంబి నుంచి శ్రీజిత్, ఓ వారం కిందట తిరువునంతపురం నుంచి జిబిన్ జార్జ్ తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆ ఇద్దరూ అనుకోకుండా కొజికోడ్ వద్ద కలుసుకున్నారు. విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. అనంతరం గమ్యస్థానానికి కలిసే చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో భారత్‌లోని వివిధ ప్రదేశాలను సందర్శించి, ప్రజలను కలుసుకోవాలని వారు భావిస్తున్నారు.
ఎన్ని రోజుల్లో తమ గమ్యాన్ని చేరుకుంటారన్న విషయంపై.. ఇద్దరిదీ ఒకటే మాట. తమకు రోజులు కాదు.. ప్రయాణాన్ని ఆస్వాదించడమే ముఖ్యమని చెప్పారు.
తాము రోజుకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించగలమో, ఎప్పుడు తమ సొంత ఊరుకు తిరిగి చేరుకుంటామో చెప్పలేమన్నారు. దీనిపై ఎలాంటి ప్రణాళిక లేదని పేర్కొన్నారు. అయితే కశ్మీర్ నుంచి తిరుగు ప్రయాణంలో ఈశాన్య రాష్ట్రాలు, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మీదుగా కేరళ చేరుకుంటామని చెప్పారు.
ఇదీ చూడండి: నేతాజీ జయంతి ఉత్సవాల్లో మమత అసహనం