TSPSC Paper Leak case Latest Update: : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ఆశ్చర్యపోయే విషయం వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో ఖమ్మం ప్రాంతానికి చెందిన దంపతులు సాయిలౌకిక్, సుస్మితల పోలీసు కస్టడీ ముగిసింది. ఇటీవలే పోలీసులు డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ (డీఏఓ) ప్రశ్నపత్రం కొనుగోలు చేసిన వీరిద్దరినీ అరెస్ట్ చేశారు. వారి నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు మూడు రోజులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఈ క్రమంలో శనివారం ఖమ్మంలో సాయిలౌకిక్ నివాసంలో ల్యాప్‌టాప్, ప్రశ్నపత్రం స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆదివారం ఉదయం నిందితుల నుంచి వాంగ్మూలం తీసుకొని సాయంత్రం చంచల్‌గూడ జైలుకు వారిని తరలించారు.
నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం... ఖమ్మం ప్రాంతానికి చెందిన పాతకార్ల వ్యాపారి సాయిలౌకిక్ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(డీఏఓ) ప్రశ్నపత్రం కొనుగోలు చేసేందుకు ప్రవీణ్‌తో రూ.10 లక్షలకు ఒప్పందం చేసుకున్నారు. దానికోసం సాయిలౌకిక్ కారును విక్రయించగా వచ్చిన రూ.6లక్షల నగదును ప్రవీణ్ బ్యాంకు ఖాతాలో జమచేశారు. ఇంకా మిగిలిన రూ.4 లక్షలు పరీక్ష రాశాక ఇస్తానంటూ ఫిబ్రవరి 23న డీఏఓ ప్రశ్నపత్రం తీసుకున్నారు సాయిలౌకిక్. అదేనెల 26న డీఏఓ పరీక్ష రాశారు. ఆ తర్వాత మార్చి 11న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ విషయం బయటపడడంతో తమ పేర్లు కూడా బయటకు వస్తాయని ఆ దంపతులు ఆందోళన చెందారు.
SIT Inquiry in TSPSC Paper Leak case : అప్పుడు మొదట గ్రూప్1 ప్రిలిమినరీ, ఏఈ పరీక్షల ప్రశ్నపత్రాలకు సంబంధించిన అంశాలే వెలుగుచూడడంతో సాయిలౌకిక్, సుస్మిత దంపతులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదే పేపర్ లీకేజీ దర్యాప్తులో భాగంగా ప్రధాన నిందితుడు అయిన ప్రవీణ్ బ్యాంకు ఖాతాలను పరిశోధించినప్పుడు సాయిలౌకిక్ ద్వారా రూ.6 లక్షలు వచ్చినట్లు వెల్లడవడంతో డీఏఓ ప్రశ్నపత్రం కూడా విక్రయించినట్టు సిట్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇదే విషయంపై కస్టడీ సమయంలో ఆ దంపతులు తామే ప్రశ్నపత్రం కొనుగోలు చేసినట్టు అంగీకరించారు. అయితే ఆ ప్రశ్నపత్రాన్ని ఎవరికీ ఇవ్వలేదని వారు చెప్పినట్టు సమాచారం.
ఇదే టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో భాగంగా న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌ను హైదరాబాద్ రప్పించి లీకైన గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష రాయించినట్టు సిట్ పోలీసుల దర్యాప్తులో ప్రధాన నిందితుడు రాజశేఖర్‌రెడ్డి అంగీకరించాడు. సిట్ పోలీసులు గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన జాబితాలో ప్రశాంత్ ఉండడంతో వాట్సప్ ద్వారా అతనికి నోటీసులు జారీచేశారు. వారు పంపిన నోటీసులకు ప్రశాంత్ మెయిల్ ద్వారా వివరణ పంపినట్టు సమాచారం. తాను గ్రూప్1 ప్రిలిమినరీ పరీక్ష కోసం కష్టపడి చదివానని, లీకైన ప్రశ్నపత్రంతో పరీక్ష రాశాననే ఆరోపణలు నిరాధారమని ప్రశాంత్ పేర్కొన్నట్టు తెలిసింది.
ఇవీ చదవండి: