ముగ్గురు దారుణంగా హత్యకు గురైన ఘటన ఝార్ఖండ్‌లోని కుంటీ జిల్లా అడ్కీ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోదెలెబె గ్రామంలో జరిగింది. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులు ఆ గ్రామానికి చెందిన సర్పంచ్, అతడి కూమారుడు, కోడలు అని పోలీసులు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం అర్ధరాత్రి కొందరు గుర్తుతెలియని దుండగులు గ్రామ సర్పంచ్ ముడా ఇంట్లోకి చొరబడ్డారు. అనంతరం పదునైన పొడవాటి ఆయుధంతో దాడి చేసి చంపేశారు. సర్పంచ్ కుమారుడు సింగా, కోడలు సిదిమా దేవిని కూడా దారుణంగా హత్య చేశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీసులకు తెలియజేయలేదు. బుధవారం మొత్తం మృతదేహాలు ఇంట్లోనే ఉన్నాయి. గ్రామస్థులు రోజంతా గ్రామ సభ నిర్వహించి, ఘటన గురించి పోలీసులకు ఎవరూ చెప్పొద్దంటూ తీర్మానించారు. కుటుంబ సభ్యులు కూడా చెప్పకూడదంటూ వారిని బెదిరించారు.
వారి మాటలు లెక్కచేయని మృతుల బంధువు బీనాదేవి.. మంగళ్ అనే సామాజిక కార్యకర్తకు ఈ విషయం చెప్పింది. అతడు పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అది నక్సల్ ప్రభావిత ప్రాంతమని, ఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలిస్తారని ఎస్పీ తెలిపారు.
ఇవీ చదవండి: వరదలో కొట్టుకొచ్చిన ఏనుగు పిల్ల.. 65 గంటల శ్రమ తర్వాత తల్లి చెంతకు..
గుడికి వెళ్తున్న వారిని వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి