Transgender Mercy killing: ఉన్నత విద్యను అభ్యసించిన ఓ ట్రాన్స్‌ఉమన్ ఉపాధి లేక.. బతుకు బరువై.. కారణ్య మరణానికి అనుమతి కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించింది. విషయం తెలుసుకున్న కేరళ సర్కారు.. ఆమెకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి, భవిష్యత్‌కు భరోసా కల్పించింది.
ఆ ట్రాన్స్‌ఉమన్ పేరు అనీరా కబీర్. ఆమె డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్. ఎంఈడీ పూర్తి చేసింది. రాష్ట్ర అర్హత పరీక్షలో (సెట్) ఉత్తీర్ణత సాధించింది. ఇన్ని అర్హతలున్న ఆమెకు ఓ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తాత్కాలిక 'ఉపాధ్యాయుడి'గా ఉద్యోగం లభించింది. అయితే ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు సరికదా.. అసలు కష్టాలు అక్కడే మొదలయ్యాయి.
పురుషుడి వేషధారణలో..
సామాజిక వివక్ష కారణంగా అనీరా పురుషుడి వేషధారణలో ఉపాధి కోసం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇంటర్వ్యూకు హాజరైంది. ఆమెకు ఉద్యోగం వచ్చింది. కానీ ఆమె ట్రాన్స్‌ఉమన్ అని తెలిసిన తర్వాత పాఠశాల అధికారులు, సహచరులు వ్యవహరించే తీరు మారిపోయింది. హేళన చేయడం మొదలు పెట్టారు. వెళ్లిన ప్రతిచోట అవమానం ఎదురైంది.
Trans Woman Mercy killing: ఫలితంగా కొలువులో చేరిన రెండు నెలలకే ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా.. ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. దీంతో ఆదాయం లేక పూట గడవడం కష్టమైంది. నానా అవస్థలు పడిన ఆమె.. చివరకు చనిపోవడానికి సిద్ధపడింది. అయితే అందరిలా ఆత్మహత్యకు పాల్పడలేదు. కారుణ్య మరణం పొందాలని నిర్ణయించుకుంది. లీగల్ సర్వీసెస్ అథారిటీని ఆశ్రయించింది. వారి సాయంతోనే కారుణ్య మరణానికి అనుమతి ఇప్పించాలంటూ.. హైకోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది.
మంత్రి పిలిచి మరీ..
ఈ విషయం రాష్ట్ర విద్యాశాఖ దృష్టికి వెళ్లింది. దీంతో ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వీ శివన్‌కుట్టి.. అనీరాను త్రివేండ్రం పిలిపించి, విద్యాశాఖలో ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. విద్యాశాఖ ఆధ్వర్యంలోని సమగ్ర శిక్ష కేరళ ప్రాజెక్టులో నియమితురాలైన నెల రోజుల్లో పర్మినెంట్ చేస్తామని ఆమెకు భరోసా ఇచ్చారు.
ప్రభుత్వ సర్వీసుల్లో విద్యార్హత ఉన్న ట్రాన్స్‌ఉమన్‌లకు రిజర్వేషన్లు కల్పించాలని అనీరా కోరారు. దీనిపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి చెప్పినట్లు అనీరా పేర్కొన్నారు.
ఇదీ చూడండి: దివ్యాంగురాలిపై గ్యాంగ్ రేప్.. పదునైన ఆయుధాలతో గాయపరిచి...