16 నెలల వయసులో చాలా మంది పిల్లలు ఏడవటం, అరచి మారాం చేయటం చేస్తుంటారు. వారికి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులే తెలుసు. కానీ తమిళనాడు తిరునల్వెళ్లికి చెందిన చిన్నారి సగయ కాస్ట్రో మాత్రం అలా కాదు.. ఫొటో చూపిస్తే చాలు.. ఎవ్వరినైనా ఇట్టే గుర్తుపట్టి పేరు చెప్పేస్తోంది. పక్షులు, జంతువులనూ గుర్తుపట్టేస్తుంది.
కిడ్ ఆఫ్ ది ఇయర్..
తల్లిదండ్రులు ఏం మాట్లాడారో మొత్తం పూసగుచ్చినట్లు సగయ చెప్పటాన్ని చిన్నారి పేరెంట్స్ రెబెకా, టెర్రాన్స్లు గుర్తించారు. ఆ తర్వాత సగయ ప్రతిభను ప్రోత్సహించారు. ఇటీవల 30 మంది రాజకీయ నేతలను అలవోకగా గుర్తుపట్టినందుకు గాను.. 'ఇండియన్ కిడ్ ఆఫ్ ది ఇయర్ 2021' అవార్డును కైవసం చేసుకుంది. ఈ అవార్డును ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందించింది. సగయ గుర్తించిన వారిలో మహాత్మాగాంధీ, మథర్ థెరెసా, నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్, ఎంకే స్టాలిన్, టీటీవీ దినకరణ్ లాంటి ప్రముఖులూ ఉన్నారు.
ఆరు నెలలకే..
సగయకు ఆరు నెలల ఉన్నప్పుడే.. ఆమె ప్రతిభను గుర్తించామని తండ్రి టెర్రాన్స్ చెప్పుకొచ్చారు. తాము ఏం చెప్పినా గుర్తుపెట్టుకుని.. మళ్లీ అప్పచెప్తుందన్నారు. సగయపై తాము ఎలాంటి ఒత్తిడి చేయలేదని తల్లి రెబెకా తెలిపారు. ఇష్టంతోనే అన్నీ నేర్చుకుందన్నారు. భవిష్యత్లో సగయ కలలను సాకారం చేసుకునేందుకు అండగా ఉంటామని స్పష్టంచేశారు.
ఏడు అవార్డులు..
తన అసమాన ప్రతిభతో ఇప్పటికే ఏడు అవార్డులను కైవసం చేసుకుంది చిన్నారి సగయ. ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్, కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అందులో ఉన్నాయి.
ఇదీ చదవండి: వండర్ కిడ్: నాలుగో తరగతిలోనే 60 గేమింగ్ యాప్స్ అభివృద్ధి