CBI investigation in Viveka's murder case: వైఎస్ వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు.. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఈ నెల 19న విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి పులివెందుల వెళ్తున్న అవినాష్ రెడ్డికి మధ్యాహ్నం వాట్సాప్ ద్వారా నోటీసులు పంపించారు. మరోవైపు పులివెందులలోని ఆయన ఇంటికి వెళ్లిన అధికారులు.. అవినాష్ ఇంట్లో లేకపోవడంతో ఆయన వాహన డ్రైవర్ నాగరాజుకు నోటీసులు అందజేశారు.
సీబీఐకి లేఖ రాసిన అవినాష్ రెడ్డి.. నోటీసులు ఇవ్వడానికి ముందుగా.. అవినాష్ రెడ్డి సీబీఐ అధికారులకు లేఖ రాశారు. ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉండటం వల్ల మంగళవారం(ఈ నెల 16) విచారణకు హాజరు కాలేనంటూ లేఖలో పేర్కొన్నారు. మరో నాలుగు రోజులు గడువు కావాలంటూ లేఖలో కోరారు. నోటీసు ఇచ్చి ఒకరోజు వ్యవధిలోనే హాజరు కావాలని సూచించడం వల్ల రాలేకపోతున్నట్లు స్పష్టం చేశారు. 160 సీఆర్పీసీ కింద సోమవారం నోటీసులు జారీ చేసిన అధికారులు.. మంగళవారం ఉదయం 11గంటలకు కోఠిలోని సీబీఐ కార్యాలయానికి రావాలని సూచించారు. అవినాష్ రెడ్డి కార్యాలయానికి వస్తారని భావించి సీబీఐ కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అవినాష్ రెడ్డి రావడం లేదని సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అవినాష్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని గాయత్రి హిల్స్‌లో తన నివాసం నుంచి బయల్దేరి పులివెందులకు వెళ్లారు.
అనుచరుల విచారణ.. పులివెందులకు చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తికి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ రోజు ఆయన సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యాడు. కుటుంబ తగాదాల నేపథ్యంలో వివేకా హత్య జరిగిందని అవినాష్ రెడ్డి పలుమార్లు ఆరోపించారు. దీంతో సీబీఐ అధికారులు ఈ కోణంలో దర్యాప్తు నిర్వహించారు. అందులో భాగంగా సీబీఐ కార్యాలయానికి పలువురిని పిలిచి ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వివేకా కూమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాతో పాటు మరికొంత మందిని ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. దాదాపు 20రోజుల గడుపు తర్వాత సీబీఐ అధికారులు మరోసారి అవినాష్ రెడ్డికి నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తేనే వివేకా హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం వస్తుందని, సీబీఐ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.
వైఎస్సార్సీపీ నేతల విచారణ.. వివేకా హత్య కేసులో సీబీఐ అధికారులు పలువురిని ప్రశ్నిస్తున్నారు. అవినాష్ రెడ్డి అనుచరులుగా ఉన్న సింహాద్రిపురం మండలం వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వేముల మండలం నల్లచెరువుకు చెందిన రవీంద్రారెడ్డి, నాగ విశ్వేశ్వర్ల నుంచి సీబీఐ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ఈ రోజు విచారణకు హాజరు కావాలని సీబీఐ అధికారులు.. ముగ్గురికీ ఇది వరకే నోటీసులు జారీ చేశారు. దీంతో ముగ్గురూ కోఠిలోని సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
వివేకా కుమార్తె, అల్లుడిని సైతం.. వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డిలను సీబీఐ అధికారులు మరోసారి ప్రశ్నిస్తున్నారు. సునీతా, రాజశేఖర్ రెడ్డి.. ఇవాళ మధ్యాహ్నం 4గంటల సమయంలో సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. వివేకా రాసిన లేఖతో పాటు, ఇతర అంశాల గురించి సీబీఐ అధికారులు సునీతా, రాజశేఖర్ రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. దంపతులిద్దరినీ గత నెలలో సీబీఐ అధికారులు కోఠిలోని కార్యాలయానికి పిలిచి ప్రశ్నించారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని చెప్పిన సీబీఐ అధికారులు.. ఆ మేరకు విచారణకు హాజరు కావాలని ఇది వరకే నోటీసులు జారీ చేశారు.
కుటుంబ తగాదాల కారణంగానే వైఎస్ వివేకా హత్య జరిగిందని అవినాష్ రెడ్డి ఆరోపించారు. సీబీఐ అధికారులు దీన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని... ఏకపక్షంగా దర్యాప్తు చేస్తున్నారని హైకోర్టులు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లోనూ అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. దీంతో సీబీఐ అధికారులు ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కుమార్తె సునీతను ప్రశ్నించిన సీబీఐ అధికారులు, మరోసారి వాంగ్మూలం నమోదు చేశారు. వైఎస్ వివేకా పీఏ కృష్ణారెడ్డి, కంప్యూటర్ ఆపరేటర్ ఇనాయతుల్లాతో పాటు మరికొంత మందిని పిలిచి ప్రశ్నించారు.
ఇవీ చదవండి :