మనిషి కష్టాల్లో ఉన్నప్పుడు సాటి మానవుడు ఆదుకోవడం సహజం. కానీ, ఓ చిన్నారి జంతువుల కష్టాలను చూసి వాటికి సాయం చేయాలనుకుంది. ఓ స్వచ్ఛంద సేవాసంస్థ కోసం రూ.80వేలు పోగు చేసి జంతువులపై తనకున్న అభిమానాన్ని చాటుకుంది. ఆమే కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన సింహాస్తిత. పదేళ్ల ప్రాయంలోనే ఎందరో జంతు ప్రేమికుల హృదయాల్ని గెలుచుకుంది.
నాలుగో తరగతి చదువుతున్న సింహాస్తితకు చిన్నప్పటి నుంచి గుర్రాలంటే ఎంతో ఇష్టం. లాక్డౌన్లో తన తండ్రితో పాటు 'సమాభవ' అనే స్వచ్ఛంద సేవాసంస్థను సందర్శించింది. అక్కడ గుర్రాల మేత కోసం ఆ జంతు సంరక్షణ కేంద్రం ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులను స్వయంగా చూసింది. ఆ సంస్థకు తన వంతు సాయం చేయాలనుకుంది. తన యూట్యూబ్ వీడియోల ద్వారా ఎందరో వైద్యులను సంప్రదించింది. అలా వచ్చిన సొమ్మును ఆ సంస్థకు ఆర్థిక సాయంగా అందించింది.
"నా చిన్ననాటి నుంచి గుర్రాలను చూస్తున్నాను. అవంటే నాకెంతో ఇష్టం. లాక్డౌన్ సమయంలో ఈ స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శించి, దానికి సాయం చేయాలని నాన్న చెప్పారు. నా వీడియోల ద్వారా కొంత సొమ్ము సేకరించి.. గుర్రాలకు మేత అందిస్తున్నాను. నా సోదరుడు(క్రికెటర్) కూడా నాకు అండగా నిలిచాడు. "
- సింహాస్తిత
'జాకీ'గా తయారవ్వడమే తన కల అంటోంది సింహాస్తిత. వాటిని పోషించేందుకు తానూ ఓ ఎన్జీఓను ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పింది.
సమాభవ ఉద్దేశమదే..
ఆపదలో ఉన్న గుర్రాలను ఆదుకోవడమే లక్ష్యంగా 2010లో 'సమాభవ' ప్రారంభమైంది. టాంగా, జట్కా వంటి వాటికి ఉపయోగించి.. వయసు దాటాక లేదా అనారోగ్యం బారినపడ్డాక వదిలేసిన అశ్వాలకు ఈ ఎన్జీఓ అండగా నిలుస్తోంది. ఇలా పదకొండేళ్లలో 62 గుర్రాలను రక్షించింది. ప్రస్తుతం అక్కడ 25 అశ్వాలున్నాయి. వాటిలో చాలావరకు కళ్లులేనివి, అనారోగ్యంతో బాధపడుతున్నవీ ఉన్నాయి.
ఇదీ చదవండి: ఆ ఇల్లు అందమైన చిత్రాలు నిండిన పొదరిల్లు