రాబోయే 3 నుంచి 5 రోజుల్లో ఎండలు మరింత తీవ్రతరం కానున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ(ఐఎండీ) ఆదివారం తెలిపింది. ఈశాన్య భారతదేశం, పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో మాత్రం సాధారణ ఉష్ణోగ్రతలే ఉంటాయని ఐఎండీ వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఈ గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఉండకపోవచ్చని తెలిపింది. ఆదివారం దక్షిణాది ప్రాంతాలైన తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్‌లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది వాతావరణ శాఖ.
తెలంగాణలో హెచ్చరికలు!
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజులు ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తూర్పు నుంచి వీచే గాలులతో ఏర్పడిన ధ్రోణి.. ఆదివారం కేరళ నుంచి కర్ణాటక, మరఠ్వాడా మీదగా విధర్భ వరకు.. సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే రెండు, మూడు రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పాడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు.
ఆంధ్రాలో పొడి వాతావరణం..
ఆంధ్రప్రదేశ్‌లో రానున్న 5 రోజులు ఎండలు సాధారణంగా ఉంటాయని అక్కడి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న 3 నుంచి 4 రోజులు రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని తెలిపింది. ఆదివారం రాష్ట్రంలో గరిష్ఠంగా 36 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించింది.
ఫిబ్రవరిలోనే రికార్ట్ స్థాయి ఉష్ణోగ్రతలు!
ఇటీవలే భారత వాతావరణ శాఖ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య కాలంలో దేశంలోని ఆగ్నేయ, దక్షిణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికంటే ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరింది. ఉత్తర్‌ప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ్‌బెంగాల్, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. వేడిగాలులు తీవ్రత అధికంగా ఉండొచ్చని ఆయన వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలపై ఈ ఉష్ణోగ్రతల ప్రభావం అంతగా ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఫిబ్రవరి నెలలో దేశంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 1901 తర్వాత గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవ్వడం ఇదే తొలిసారి అని ఐఎండీ తెలిపింది. అయితే, పశ్చిమప్రాంతాల మీదుగా వీచిన గాలుల కారణంగా మార్చి నెలలో భారత్‌లోని వివిధ రాష్ట్రాల్లో అసాధారణ స్థాయిలో వర్షపాతం నమోదైంది.