TDP leaders participated in Nyayaniki Sankellu program: చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు 'న్యాయానికి సంకెళ్లు' నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు కుటుంబ సభ్యులు నారా లోకేశ్, బ్రాహ్మణి, భువనేశ్వరి తో పాటు.. టీడీపీ నేతలు హాజరై, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. చేతులకు తాళ్లు కట్టుకుని చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కుట్ర పన్నుతున్నారని నేతలు ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యంపై తప్పుడు నివేదికలు ఇస్తున్నారని లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు విషయంలో ప్రభుత్వం.. ప్రజల్ని మోసం చేస్తోందని బ్రహ్మణీ ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం టీడీపీ ఆఫీసు వద్ద 'న్యాయానికి సంకెళ్లు' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా భువనేశ్వరి పాల్గొన్నారు. చేతులకు నల్ల తాళ్లు కట్టుకుని నిరసన తెలిపారు. ఈ నిరసనల్లో పాల్గొన్న బుచ్చయ్య, చినరాజప్ప, కోటేశ్వరరావు తదితర నేతలు పాల్గొన్నారు. చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు చేశారు. చంద్రబాబు ఆరోగ్యం కోసం మాజీ మంత్రి ప్రత్తిపాటి పూజలు చేశారు. న్యాయానికి, ధర్మానికి సంకెళ్లు వేస్తే ఈ దేశం నడిచేదెలా? అంటూ ప్రశ్నించారు. ప్రజల పూజలు ఫలించి త్వరలోనే చంద్రబాబు బయటకొస్తారని ప్రత్తిపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. న్యాయానికి సంకెళ్లు' కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యే కోటంరెడ్డి పాల్గొన్నారు. చేతులకు తాళ్లు కట్టుకొని కార్యకర్తలు పెద్దఎత్తున నినాదాలు చేశారు. అరెస్ట్ అక్రమం అంటూ విమర్శలు గుప్పించారు.
విశాఖలోని టీడీపీ కార్యాలయం వద్ద 'న్యాయానికి సంకెళ్లు' పేరిట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. చంద్రబాబును అక్రమంగా జైలులో పెట్టారని ఆయన మండిపడ్డారు. ఆధారాలు లేకపోయినా అక్రమంగా అరెస్టు చేశారని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. జగన్ గూబగుయ్యిమనిపించేలా 'న్యాయానికి సంకెళ్లు' కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. అరెస్ట్ చేసి 37 రోజులైనా ఒక్క ఆధారం చూపలేకపోయారని వైసీపీపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు బరువు తగ్గలేదని అబద్దాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏసీబీ కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించట్లేదని పేర్కొన్నారు. సాయంత్రం వరకు చంద్రబాబుకు ఏసీ పెట్టలేదని పేర్కొన్నారు. చంద్రబాబుకు ప్రాణహాని తలపెట్టాలని కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వైద్య నివేదికను కోరినా అధికారులు ఇవ్వట్లేదని ఆరోపించారు.
తెలంగాణలోని హైదరాబాద్‌తో పాటుగా వివిధ ప్రాంతాల్లో చంద్రబాబుకు మద్దతుగా.. టీడీపీ నేతలు, చంద్రబాబు అభిమానులు న్యాయానికి సంకెళ్లు' కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో తెలుగుదేశం శ్రేణులు, చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ నిరసన కార్యక్రమ చెపట్టారు. నిజామాబాద్ ఎన్టీఆర్ చౌరస్తాలో 'న్యాయానికి సంకెళ్లు' కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు అభిమానులు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ట్విట్టర్‌లో చంద్రబాబుకు మద్దుతుగా... అటు సోషల్ మీడియాలో సైతం మద్దతు లభిస్తుంది. ట్విట్టర్‌లో #NyayanikiSankelluForCBN అనే యాష్ టాగ్ దేశవ్యాప్తంగా 1 వ స్థానంలో ట్రెండ్ అవుతుంది. చంద్రబాబు గారి అక్రమ అరెస్ట్ కి నిరసనగా న్యాయానికి సంకెళ్లు అంటూ నారా లోకేశ్ పిలుపు మేర తెలుగు ప్రజలు చేస్తున్న వినూత్నంగా కార్యక్రమానికి మద్దతుగా ట్విట్టర్ వేదికగా #NyayanikiSankelluForCBN అనే యాష్ టాగ్ తో నెటిజన్లు వేల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నారు.