TDP Leaders Candle Rally: చంద్రబాబు అరెస్టుపై ఆగ్రహ జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. చంద్రబాబుకు మద్దతుగా తెలుగుదేశం నేతలు, అభిమానులు, శ్రేణులు వివిధ రూపాల్లో తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారు. తాజాగా ఊరూవాడా అంతా కలిసి కొవ్వొత్తులు, కాగడాల ప్రదర్శనలతో నిరసన వెలుగులు విరజిమ్మారు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళనలు ఉద్ధృతం చేశాయి. విజయవాడ పైపులు రోడ్డు కూడలిలో మహాత్ముని విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో మహిళలు కాగడాలతో నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరులో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కపిలేశ్వరపురంలో మహిళలు కాగడాలతో ర్యాలీ చేపట్టారు. గన్నవరంలోనూ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. యనమలకుదురులో లైట్లు ఆపి చిన్నారులు కొవ్వొత్తులు ప్రదర్శించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ, పెనుగంచిప్రోలు, మైలవరంలో మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ గుంటూరులో తెలుగుదేశం చేపట్టిన కాగడాల ర్యాలీ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి, తుళ్లూరు మండలాలలో తెలుగుదేశం పార్టీ నేతలు కాగడాల ర్యాలీ నిర్వహించారు. చిలువూరులో మహిళలు, చిన్నారులు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. తుళ్లూరు, మందడంలో రాజధాని రైతులు, మహిళలు కొవ్వొత్తులతో రోడ్డెక్కారు. చినకాకానిలో టీడీపీ నేతల ర్యాలీకి జనసేన కార్యకర్తలు మద్దతు తెలిపి కాగడాల ప్రదర్శించారు.
బాపట్ల జిల్లా వ్యాప్తంగానూ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. ఈపురుపాలెంలో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. యడ్లపల్లిలో గ్రామస్తులు మొత్తం కొవ్వుతులతో నిరసన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మహిళలు, చిన్నారులు ఇళ్లల్లో లైట్లు ఆపి కొవ్వుతులు ప్రదర్శించారు. నాయుడుపేటలో ఎమ్మెల్యే బాలా వీరాంజనేయ స్వామి ఇంటి ముందు కొవ్వొత్తులు, దీపాలతో నిరసన తెలిపారు. లింగంగుంటలోనూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు సంతపేటలో మాజీమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు.
చంద్రబాబుతో మేము అంటూ అనంతపురం శ్రీనగర్ కాలనీలోని సిరి బృందావన్ అపార్ట్మెంట్లో చిన్నారులు, మహిళలు ఇళ్లలోని విద్యుత్ దీపాలు ఆర్పి కొవ్వొత్తులు వెలిగించారు. రామ్ నగర్‌లో టీడీపీ దీక్షా శిబిరం వద్ద నేతలు కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. గుంతకల్లులోనూ కొవ్వొత్తుల ర్యాలీ సాగింది.
అనంతపురం జేఎన్టీయూ సమీపంలో.. అయామ్ విత్ సీబీఎన్ అనే అక్షరాలకు నిప్పు పెట్టి టీడీపీ ఎస్సీ నేతలు, టీఎన్ఎస్ఎఫ్ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. వైఎస్సార్ జిల్లా మైదుకూరులో కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా ఆదోనిలో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర దీపాలతో నిరసన తెలిపారు. నంద్యాల శ్రీనివాస సెంటర్లో జరిగిన కొవ్వొత్తుల ర్యాలీలో మాజీమంత్రులు ఫరూక్, ఏరాసు ప్రతాప రెడ్డి పాల్గొన్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ టీడీపీ కార్యకర్తలతో కలిసి కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లా వేములపూడిలో టీడీపీ నేతలు మానవహారంగా ఏర్పడి జగన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
తెలంగాణలోనూ నిరసనలు: చంద్రబాబుకు సంఘీభావంగా తెలంగాణలోనూ నిరసనలు కొనసాగాయి. హైదరాబాద్ రాయదుర్గం ఖాజాగూడలో కొవ్వొత్తులు ప్రదర్శించారు. నిజాంపేట్‌లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సనత్ నగర్ గాంధీ విగ్రహం వద్ద నల్ల బెలూన్లతో నిరసన చేపట్టారు. సూర్యాపేట జిల్లా రామచంద్రపురంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు.