TDP Criticizes AP Government Evaluated Value of Siemens Project: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబును ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేయాలనే ఉద్దేశం తప్ప.. ఈ కేసులో తప్పొప్పులపై ప్రభుత్వం ఏమాత్రం శ్రద్ధ చూపలేదని టీడీపీ ఆరోపిస్తోంది. సీమెన్స్ నుంచి కొనుగోలు చేసిన పరికరాలను ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ సంస్థతో మదింపు చేసినా.. ఆ నివేదక కాదని రాష్ట్ర ప్రభుత్వానికి నచ్చిన ప్రైవేట్ సంస్థతో నివేదిక తెప్పించుకుని నిధులు దారి మళ్లించారంటూ ఆరోపిస్తోంది. కేవలం చంద్రబాబును ఈ కేసులో ఇరికించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వ నివేదికను సైతం పక్కనపెట్టి.. ప్రైవేట్ సంస్థతో తనకు నచ్చినట్లు నివేదికలు తయారు చేయించుకుందని తెలుగుదేశం నేతలు మండిపడుతున్నారు.
సీమెన్స్ ప్రాజెక్టులో సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్ విలువను ఆ రంగంలో ఎంతో అనుభవం ఉన్న కేంద్ర ప్రభుత్వానికి చెందిన సీఐటీడీ మదింపు చేసి.. వాటి విలువ వాస్తవమే అని తేల్చింది. ఈ కేసును విచారిస్తున్న సీఐడీ మాత్రం.. ఎలాంటి సాంకేతిక అర్హత లేని ఓ ప్రైవేటు సంస్థను ఫోరెన్సిక్ ఆడిటర్‌గా నియమించింది.
ఈ సంస్థ క్షేత్రస్థాయికి వెళ్లకుండానే గదిలోనే కూర్చుని నివేదిక తయారు చేసేలా నిబంధనలు మార్చి.. నిధులు దారిమళ్లాయని వారి నుంచి నివేదికలు తీసుకుందని తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. అంతిమంగా చంద్రబాబే నిధుల్ని విడుదల చేయించి షెల్ కంపెనీలకు మళ్లించారని ఆరోపిస్తూ సీఐడీ ఆయన్ను అరెస్టు చేసింది. క్షేత్రస్థాయిలో పరిశీలించి విలువ మదింపు చేసిన సీఐటీడీ నివేదిక కాకుండా.. గదిలో కూర్చుని తయారుచేసిన నివేదికనే ప్రాతిపదికగా మార్చుకుంది.
ఒక్కో క్లస్టర్‌కు సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్ విలువ 559.34 కోట్ల రూపాయలని సీఐటీడీ తెలపగా.. సీఐడీ మాత్రం ప్రభుత్వం విడుదల చేసిన 371 కోట్లలో 241 కోట్లను చంద్రబాబు మళ్లించారని అభియోగాలు మోపింది. సీఐటీడీ నివేదిక ఉందనే విషయాన్ని కూడా పట్టించుకోలేదు. చంద్రబాబు నిధులు మళ్లించారని చెప్పించడమే లక్ష్యంగా గదిలో కూర్చోబెట్టి నివేదికలు తయారుచేయించి.. అదే వందశాతం నిజం అన్నట్లుగా వ్యవహరిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు.
హార్డ్‌వేర్, సాప్ట్‌వేర్, ఇతర పరికరాల విలువలను అంచనా వేయాలంటే.. సంబంధిత సంస్థలకు సాంకేతిక అర్హత ఉండాలి. ఇంజినీరింగ్ నిపుణులతో కూడిన బృందాలకే ఇది సాధ్యం. అయితే విచారణ సంస్థలు ఏర్పాటుచేసిన ఫోరెన్సిక్ ఆడిట్ సంస్థకు ఉన్న అర్హతలేమిటనేది ప్రశ్నార్థకం. ఒక ఆడిటింగ్ సంస్థ సాప్ట్‌వేర్ విలువలనేలా అంచనా వేస్తుంది అనేది నిపుణుల ప్రశ్న. దీనికి అధికారుల నుంచి సమాధానం లేదు. ఏదైనా సంస్థ పనితీరు, అక్కడి పరికరాల విలువ తెలియాలంటే క్షేత్రస్థాయికి వెళ్లి వాటిని పరిశీలించి విచారణ చేపట్టాలి.
రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శరత్ అండ్ అసోసియేట్స్ సంస్థ అలాంటి విచారణేమి చేయలేదు. ఒప్పందంలో ఆ క్లాజ్‌ను మినహాయించడమే దానికి కారణమని స్వయంగా ఆ సంస్థ తన నివేదికలో పేర్కొందని టీడీపీ వర్గాలు గుర్తుచేశాయి. అలా క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా అసలు వాస్తవ విలువను ఎలా నిర్ధారిస్తారు? క్లస్టర్ల వారీగా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, సాంకేతిక నైపుణ్య శిక్షణ కేంద్రాల్లో సీమెన్స్ సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్, ఇతర పరికరాలు ఉన్నాయో లేదో చూడకుండా ఇచ్చే నివేదిక అర్థవంతంగా ఉంటుందా అని తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు.
క్లాజ్ తొలగించడం తమకు నచ్చినట్లు లెక్కలు వేయించడానికేనని ఆరోపించారు. శరత్ అసోసియేట్స్‌కు వైసీపీ ముఖ్యనేతలతో సంబంధాలున్నాయని తెలిపారు. అలాంటప్పుడు అధికారపార్టీకి అనుకూలంగా నివేదిక ఇచ్చేందుకు అవకాశం లేదా అని నిలదీశారు.
సీమెన్స్ సంస్థకు చెందిన సాప్ట్‌వేర్, హార్డ్‌వేర్‌ను మదింపు చేసిన సీఐటీడీ 1968లో ఏర్పాటై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే సంస్థ. ఎంటెక్ సహా డిప్లొమా, మెకానికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో నైపుణ్య శిక్షణ ఇస్తుంది. సీమెన్స్ ప్రాజెక్టు (Siemens Project) విలువను అంచనా వేయాలి అంటే ఇంతకంటే మెరుగైన సంస్థ ఇంకోటి ఉంటుందా. వాస్తవానికి బాబా అటామిక్ రీసెర్చి సెంటర్ బార్క్, హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఎల్, డిఫెన్స్ రీసెర్చి డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ డీఆర్డీవో, ఆర్డెనెన్స్ ఫ్యాక్టరీలతో పాటు ప్రభుత్వరంగ సంస్థలకు సీఐటీడీ పరికరాల్ని తయారుచేసి ఇస్తుంది.
గత ప్రభుత్వంలో స్కిల్‌డెవలప్‌మెంట్ ముఖ్య కార్యదర్శి ప్రేమ్‌చంద్రారెడ్డి.. సీఐటీడీకి లేఖ రాసి సీమెన్స్ ప్రాజెక్టు విలువను మదింపు చేయించారు. అప్పటి అధికారులు దీన్ని ప్రామాణికంగా తీసుకున్నారు. ప్రస్తుత ప్రభుత్వం దాన్ని పట్టించుకోవడం లేదు. సీమెన్స్ ద్వారా సందేశాలు పంపి.. ఎక్కువ విలువ వేయించారని అడ్డగోలుగా వాదిస్తోంది. కేంద్ర సంస్థ నివేదికను సైతం తప్పుపడుతోంది. ఎలాంటి అర్హతా లేని ప్రైవేటు ఫోరెన్సిక్ సంస్థ ఇచ్చిన నివేదికే తమకు ప్రామాణికమనేలా ప్రభుత్వం వైఖరి కనిపిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వంతో త్రైపాక్షిక ఒప్పందంలో భాగంగా 6 ఎక్స్‌లెన్స్ కేంద్రాలు, 36 సాంకేతిక శిక్షణ కేంద్రాలకు అవసరమైన పరికరాలను సరఫరా చేశామని డిజైన్‌టెక్ ఎండీ ఖన్వీల్కర్ స్పష్టం చేశారు. విచారణ సంస్థలకు కావాలంటే మొత్తం వివరాలను రసీదులతో సహా ఇస్తామని చెబుతున్నారు. అయినా సీఐడీ మాత్రం.. ఆ దిశగా అడుగులు వేయలేదు. కనీసం క్షేత్ర స్థాయిలో ఎలాంటి పరికరాలు ఇచ్చారనే సమాచారం కూడా ఎక్కడా చెప్పడం లేదు. తమకు ఈ ప్రాజెక్టుతో సంబంధం లేదని సీమెన్స్ చెబుతోందంటూ.. అరకొర సమాచారాన్ని వల్లెవేస్తోంది.
గత ప్రభుత్వంలో సీనియర్ అధికారుల బృందాలే గుజరాత్‌లోని సీమెన్స్ ఎక్స్‌లెన్స్ కేంద్రాలను సందర్శించారన్న విషయాన్ని కావాలనే విస్మరిస్తోంది. నోట్‌ఫైల్స్, చంద్రబాబు సంతకాలు అంటూ నిర్దేశించుకున్న పరిధిలోని దర్యాప్తు వివరాలనే చెబుతోంది.