Supreme Court on R5 zone: R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం అంశంపై వైసీపీ ప్రభుత్వానికి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలంటూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. అమరావతిలోని R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై (High Court on R5 Zone) స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రతివాదులకు నోటీసులిచ్చిన సర్వోన్నత న్యాయస్థానం.. నవంబర్‌లో విచారణ చేపడతామని స్పష్టం చేసింది.
రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రభుత్వం R-5 జోన్ ఏర్పాటు చేసి పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేసింది. ఆ స్థలాల్లోనే కేంద్రం మంజూరు చేసిన ఇళ్లు నిర్మించేందుకు వైసీపీ ప్రభుత్వం వడివడిగా అడుగులు వేయగా... ఈ వ్యవహారంపై రాజధాని రైతులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ చేపట్టిన హైకోర్టు.. R-5 జోన్‌లో ఇళ్ల నిర్మాణం చేపట్టరాదంటూ తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించగా... హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
పిటిషన్‌పై విచారణ సందర్భంగా R-5 జోన్‌కు, రాజధాని అంశానికి ఏమైనా సంబంధం ఉందా అని జస్టిస్ సంజీవ్‌ఖన్నా కోరగా... ఎలాంటి సంబంధం లేదని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాది అభిషేక్ సింఘ్వీ తెలిపారు. కేంద్రం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం కోసమే ఈ ప్రాజెక్టు చేపట్టారని తెలిపారు. పేదలకు పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించగా.. హైకోర్టు స్టే ఇచ్చిందని అభిషేక్ సింఘ్వీ వాదించారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. జస్టిస్ జోసెఫ్ ఉత్తర్వులకు అనుగుణంగానే హైకోర్టు విచారణ జరిపి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపింది.
ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో అత్యవసరంగా విచారించాల్సిన అంశాలు ఏమీ లేవని తెలిపింది. అయితే మూడు, నాలుగు విచారించాల్సిన అంశాలు స్పష్టంగా ఉన్నందున తదుపరి విచారణ చేపడతామన్నారు. అందుకే ప్రతివాదులకు నోటీసులు ఇస్తున్నట్లు తెలిపిన ధర్మాసనం.. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాల్సిన అత్యవసరమేమీ కనిపించడం లేదంటూ నిరాకరించింది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద చేపట్టిన పథకాన్ని హైకోర్టు నిలిపివేసిందని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది వాదించగా... దీనిలో మూడు నాలుగు విషయాలు ముడిపడి ఉన్నాయని.. వాటిలో ముఖ్యంగా నిధుల ఖర్చుకు సంబంధించినవి ఉన్నాయని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ ప్రాజెక్ట్ కోసం దాదాపు వెయ్యికోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉందని... ఆ నిధులు ఇంకా ఖర్చు చేయలేదని, ఇప్పుడు ఖర్చు చేస్తే మళ్లీ వెనక్కి తీసుకోలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. కాబట్టి కొంతకాలం వేచిచూడాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హితవు పలికింది.
పిటిషన్‌పై విచారణ ముగిసిన తర్వాత అమరావతికి, ఆర్-5 జోన్‌కు ఉన్న సంబంధంపై జస్టిస్ సంజీవ్ ఖన్నా న్యాయవాదులను అడిగి తెలుసుకున్నారు. అమరావతికి, ఈ అంశానికి ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాదులు అభిషేక్ సింఘ్వీ, నిరంజన్‌రెడ్డి తెలపగా.. అత్యంత దగ్గర సంబంధం ఉందని రైతుల తరపు న్యాయవాదులు వివరించారు. ఆ తర్వాత కూడా ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వీ.. R-5 జోన్‌కు సంబంధించిన విషయాలు ప్రస్తావించగా.. ఇలాగే వాదనలు చేస్తే జనవరికి వాయిదా వేయాల్సి ఉంటుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా హెచ్చరించారు.
మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని సింఘ్వీ కోరగా.. తుది వాదనలే వింటామని ఆయన స్పష్టం చేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు.. నవంబర్‌లో విచారణ చేపడతామని తెలిపింది. ప్రతివాదులు కౌంటర్ దాఖలు చేసిన మూడు వారాల్లో రిజాయిండర్ దాఖలు చేయాలని పిటిషనర్లను సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.