Supreme Court On 370 Abrogation : కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్-370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై ఆగస్టు 2 నుంచి పూర్తి స్థాయి విచారణ జరపనున్నట్లు సుప్రీంకోర్టు వెల్లడించింది. ఈ కేసుకు సంబంధించిన వాదప్రతివాదులందరూ జులై 27లోపు తమ లిఖితపూర్వక పత్రాలు సమర్పించాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఆదేశించింది. ఆ తర్వాత ఎలాంటి పత్రాలు స్వీకరించబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ సూర్యకాంత్ సభ్యులుగా ఉన్నారు. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై సోమ, శుక్రవారాల్లో తప్ప మిగితా రోజుల్లో విచారణ జరుగుతుందని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ప్రభుత్వం, పిటిషనర్లు తమ అభిప్రాయాలు సమర్పించే విషయమై వారికి సాయంగా ఉండేందుకు.. ఇద్దరు న్యాయవాదులను నియమించింది.
వారి పేర్ల తొలగింపునకు సుప్రీం ఓకే
అంతకుముందు.. ఆర్టికల్ 370 రద్దును వ్యతిరేకించిన పిటిషనర్లలో నుంచి తమ పేర్లను తొలగించాలన్న షా ఫైజల్, షేహ్లా రషీద్‌ల అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. ఇదివరకు పిటిషనర్లుగా ఉన్న ఐఏఎస్ అధికారి షా ఫైజల్, హక్కుల కార్యకర్త షేహ్లా రషీద్‌లు.. ఈ వ్యవహారం నుంచి తప్పుకున్న నేపథ్యంలో కేసును ఇకపై 'ఆర్టికల్ 370 ఆఫ్ కాన్స్టిట్యూషన్'గా పిలవనున్నట్లు తెలిపింది. తొలుత దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభిప్రాయం కోరగా.. పిటిషన్ ఉపసంహరణపై తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన బదులిచ్చారు. దీంతో వారిద్దరి పేర్లను సుప్రీం తొలగించింది. ఇదివరకు ఈ కేసులో లీడ్ పిటిషనర్‌గా షా ఫైజల్ ఉండేవారు. అప్పుడు కేసు పేరును 'షా ఫైజల్ అండ్ అదర్స్ వర్సెస్ కేంద్ర ప్రభుత్వం'గా పిలిచేవారు. 2019ఆగస్టు 5న ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్ము-కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా కేంద్రం విభజించింది.
'ఆర్టికర్ 370 రద్దు తర్వాత కశ్మీర్ ప్రశాంతం'
మరోవైపు జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 రద్దు తర్వాతి పరిస్థితులపై సోమవారం సుప్రీం కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్రం. రద్దు అనంతరం ఆ ప్రాంతంలో మునుపెన్నడూ లేని విధంగా ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీధుల్లో హింసాత్మక ఘటనలు తగ్గిపోయాయని.. అభివృద్ధిలో, సుసంపన్నతలో కశ్మీర్ దూసుకుపోతోందని చెప్పింది. మతమార్పిడి, తీవ్రవాద దాడులు, నెట్‌వర్క్ కార్యకలాపాల వంటివి గత చరిత్రేనని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో కేంద్రం వివరించింది.
ఇవీ చదవండి : 'న్యాయం జరిగే వరకు కశ్మీర్లో టార్గెట్ హత్యలు ఆగవు'
'కశ్మీర్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదు..' ఆజాద్ కీలక వ్యాఖ్యలు