కొంగతో స్నేహం చేస్తూ ఇటీవల వార్తల్లోకెక్కిన ఉత్తర్‌ప్రదేశ్ అమేఠీకి చెందిన మహ్మద్ ఆరిఫ్‌కు షాక్ తగిలింది. అతడి నుంచి ఆ పక్షి దూరమైంది. ఉత్తర్‌ప్రదేశ్ అటవీ శాఖ అధికారులు ఆ పక్షిని స్వాధీనం చేసుకున్నారు. పక్షికి స్వేచ్ఛ ప్రసాదించేందే ఉద్దేశంతో అతడికి దాన్ని దూరం చేశారు. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. కొంగ దూరమైందన్న బాధతో ఆరిఫ్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
అమేఠీలో నివసించే ఆరిఫ్‌కు కొంగతో మంచి స్నేహం ఉండేది. ఎక్కడికి వెళ్లినా వెంటే వచ్చేది. ఆరిఫ్ బైక్‌పై ప్రయాణిస్తే.. కొంగ సైతం ఎగురుతూ అతడి వెంటే వెళ్లేది. ఎప్పుడూ అతడికి దూరంగా ఉండేది కాదు. ఆరిఫ్ దానికి బచ్చా అని పేరు పెట్టుకొని జాగ్రత్తగా చూసుకునేవాడు. ఆరిఫ్ అంటే ఆ కొంగకు కూడా చాలా ఇష్టం. కానీ, ఇతరులు ఎవరైనా దాని దగ్గరకు వస్తే దాడి చేసేది. ఆరిఫ్ ఇంట్లో లేనప్పుడు.. దానికి ఆహారం పెట్టేందుకు వెళ్లే అతడి కుటుంబ సభ్యులను దగ్గరకు రానిచ్చేది కాదు. సీజన్లు మారిపోయినా.. వేరే కొంగలు దాని దగ్గరికి వచ్చినా.. బచ్చా మాత్రం ఆరిఫ్‌ను వదిలిపెట్టలేదు.
వీరిద్దరి మధ్య అంత గాఢమైన స్నేహం ఏర్పడటానికి ఓ కారణం ఉంది. ఏడాది క్రితం అతడికి పొలంలో ఈ కొంగ కనిపించింది. కాలు విరిగిపోయి.. సరిగా నడవలేని స్థితిలో ఆరిఫ్ కంట పడింది. నొప్పితో అది బాధపడటాన్ని చూడలేని ఆరిఫ్.. కొంగను దగ్గరికి తీసుకొని చికిత్స చేశాడు. కొంగ తిరిగి నిలబడేలా వెదురు పుల్లలు కట్టాడు. క్రమంగా అది కోలుకుంది. పూర్తిగా ఆరోగ్యంగా తయారైంది. అయినప్పటికీ అది ఎక్కడికీ ఎగిరిపోలేదు. తనను కాపాడిన ఆరిఫ్‌తోనే ఉండిపోయింది.
ఆరిఫ్‌తో స్నేహం పెంచుకున్న కొంగ.. ఎక్కడికి వెళ్లినా వదిలేది కాదు. ఎప్పుడైనా దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే కొంగకు కనిపించకుండా బయటకు వెళ్లిపోతాడు. ఆరిఫ్ ఇంటికి వచ్చేయగానే.. అతడిని చూసి కొంగ తెగ సంబరపడిపోయేది. రెక్కలు ఆడిస్తూ స్వాగతం చెబుతుంది. ఒకవేళ కొంగ ఎప్పుడైనా బయటకు వెళ్తే.. ఆరిఫ్ ఇంటికే తిరిగి వచ్చేస్తుంది. అలాంటి వీరిద్దరు ఇప్పుడు విడిపోవడం చర్చనీయాంశంగా మారింది.
కొంగ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర పక్షి. రాష్ట్ర పక్షులను సంరక్షించాలన్న ఉద్దేశంతోనే అటవీ శాఖ అధికారులు ఆరిఫ్ వద్ద ఉన్న కొంగను తీసుకెళ్లిపోయారు. అధికారులకు ఆరిఫ్ పూర్తిగా సహకరించాడు. కొంగను స్వయంగా అటవీ శాఖ అధికారుల వాహనం వద్దకు తీసుకెళ్లాడు. పదేపదే కొంగను తడుముతూ.. భావోద్వేగానికి గురయ్యాడు. ఎప్పుడూ ఆరిఫ్‌ను విడిచిపెట్టి ఉండని ఈ కొంగ.. ఈ సారి అధికారులను తప్పించుకొని మళ్లీ తిరిగొస్తుందా లేదా అనేది చూడాలి.