ఉత్తర్‌ప్రదేశ్ జౌన్‌పుర్‌లో అరుదైన శస్త్రచికిత్స చేశారు వైద్యులు. కడుపు నొప్పితో బాధపడుతున్న ఓ వ్యక్తి ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆసుపత్రి వైద్యులు ఎక్స్‌రే తీయగా. రోగి శరీరంలో గ్లాసు ఆకారంలో ఏదో ఉన్నట్లు బయట పడింది. దీంతో రోగికి శస్త్రచికిత్స నిర్వహించారు వైద్యులు. విజయవంతంగా గ్లాసును రోగి కడుపులో నుంచి బయటకు తీశారు.
అసలేం జరిగిందంటే: జౌన్‌పుర్ జిల్లాలోని గోత్వా భటౌలీ గ్రామానికి చెందిన సమరనాథ్.. కొన్ని రోజుల నుంచి కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రి వైద్యుడు లాల్ బహదూర్ వద్దకు వెళ్లాడు. ఎక్స్‌రే తీసిన వైద్యుడు కడుపులో గ్లాసు లాంటి ఆకారాన్ని గుర్తించాడు. సుమారు గంటపాటు వైద్యబృందం శ్రమించి సమరనాథ్ కడుపులో నుంచి స్టీల్ గ్లాసును బయటకు తీశారు. రోగి కడుపులోకి స్టీల్ గ్లాసు ఎలా చేరిందని సమరనాథ్ భార్య మనోరమను వైద్యులు అడగగా.. తన భర్తకు హెర్నియా ఉందని తెలిపింది. చాలా రోజుల నుంచి తన భర్త సరిగ్గా తినట్లేదని తెలిపింది. మలమూత్ర విసర్జనకు వెళ్లట్లేదని చెప్పింది. కాగా, దీనిపై వైద్యుడు వివరణ ఇచ్చారు.
"సమరనాథ్ నా దగ్గరకి చికిత్స కోసం వచ్చాడు. ఏంటి ఆరోగ్య సమస్య అని అడగగా కడుపు నొప్పిగా ఉందని చెప్పాడు. శస్త్ర చికిత్స చేసి అతడి కడుపులో ఉన్న స్టీల్ గ్లాసును తొలగించాం. స్టీల్ గ్లాసు ఎలా కడుపులోకి వెళ్లిందని రోగిని ప్రశ్నించగా.. నోటి ద్వారా వెళ్లిందని చెప్పాడు. నిజానికి అతడు చెప్పింది అబద్దం. నోటి ద్వారా గ్లాసు కడుపులోకి వెళ్లే అవకాశం లేదు. స్టీల్ గ్లాసు కచ్చితంగా మలద్వారం నుంచే కడుపు లోపలికి వెళ్లి ఉంటుంది."
-లాల్ బహదూర్, వైద్యుడు
ఇవీ చదవండి: జైళ్లలో యథేచ్ఛగా డ్రగ్స్.. ఖైదీలకు డోప్ టెస్టులు.. అధికారులు షాక్