బాంబు బెదిరింపుతో దిల్లీ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న స్పైస్‌జెట్ విమానంలో బాంబు ఉందన్న సందేశాన్ని ప్రయాణికులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. 2 గంటల పాటు తనిఖీ చేయగా అది తప్పుడు సందేశం అని తేలింది.
సోమవారం మధ్యాహ్నం 117 మంది ప్రయాణికులతో ఓ స్పైస్‌జెట్ జైసల్మేర్ నుంచి దిల్లీ ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బోర్డింగ్ సమయంలో ప్రయాణికులు తక్కువగా ఉన్నందున వెనుక సీట్లలో ఎవరూ కూర్చోలేదు. కానీ విమానం దిగే సమయంలో ఓ ప్రయాణికురాలు వెనుకనున్న ఓ సీటుపై.. 'ఈ విమానంలో బాంబు ఉంది' అని హిందీలో రాసి ఉన్న సందేశాన్ని గుర్తించింది. వెంటనే ఈ విషయం సిబ్బందికి తెలిపింది. దీంతో విమానం దిగితున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
వెంటనే రంగంలోని దిగిన భద్రతా దళాలు హుటాహుటిన ప్రయాణికులను ఖాళీ చేయించారు. అనంతరం విమానాన్ని పూర్తిగా స్కాన్ చేసిన సిబ్బంది.. ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధరించారు. ప్రస్తుతం ఈ సందేశం రాసిన వ్యక్తిని గుర్తించే పనిలో పడినట్లు తెలిపారు. దీనికోసం ప్రయాణికుల అందరి వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. దీనికోసం సాంకేతిక నిఘాను కూడా ఉపయోగిస్తున్నట్లు వెల్లడించారు.