Sonia Gandhi health issues: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కొవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. 'సోనియా గాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మరికొన్ని రోజులు సోనియా ఆసుపత్రిలో ఉంటారు. ఆమె అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేయాభిలాషులకు ధన్యవాదాలు' అని పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేశారు. మరోవైపు సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం సోనియా గాంధీ ఆసుపత్రికి వచ్చారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
నేషనల్ హెరాల్డ్ వ్యవహారంలో జూన్ 8న ఈడీ ముందు విచారణకు సోనియా గాంధీ హాజరుకావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపించింది. కరోనాతో బాధపడుతున్న కారణంగా విచారణకు హాజరుకాలేనని.. మూడు వారాల గడువు ఇవ్వాలని సోనియా కోరారు. దీంతో ఈ నెల 23న తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ తాజాగా సమన్లు జారీ చేసింది.
ఏంటీ కేసు?: కాంగ్రెస్‌కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. ఇందుకు సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై దిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో స్వామి కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు యత్నించారని పిటిషన్‌లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ సీనియర్ నేతలు మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్‌ను ఈడీ ప్రశ్నించింది.
ఇవీ చదవండి: 'నా ఫ్యామిలీ ప్రమాదంలో ఉంది.. ఆ వివరాలు ఎవరికీ చెప్పొద్దు ప్లీజ్'
'నాకు మరో మూడు వారాలు గడువు కావాలి'.. ఈడీకి సోనియా విజ్ఞప్తి