మనసుకు నచ్చింది చేయాలని ఆశించాడు. సాఫ్ట్వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి తనకు నచ్చిన దారిలో నడిచాడు. దేవతా మూర్తుల విగ్రహాల అలంకారణలో నిష్ణాతుడయ్యాడు. ఈ అరుదైన కళను మరో పది మందికి పంచాలని యాప్, వెబ్‌సైట్‌ను రూపొందించాడు. ఈ కళ నేర్చుకోవాలనుకున్న వారికి శిక్షణ కూడా ఇస్తున్నాడు. ఆసక్తి ఉంటే మహిళలు కూడా నేర్చుకోవచ్చని.. దేవుడికి అందరూ సమానమే అని చెబుతున్నాడు. అతడే తమిళనాడు చెన్నైలోని అనంత పద్మనాభస్వామి దేవాలంలో ఉన్న దుర్గాదేవి విగ్రహాన్ని అలంకరించే 33 ఏళ్ల పూజారి ఎస్. గౌతమ్.
దేవుడితో మమేకం కావాలి
దేవతా మూర్తులను అలంకరించడంపై గౌతమ్‌కు చిన్ననాటి నుంచి ఆసక్తి. వాళ్ల తండ్రి కూడా అదే పని చేసేవాడు. చిన్నప్పుడు ఎవరికైనా వారి నాన్నే హీరో అని.. అతడిలా కావలనుకుంటారని.. తాను కాడా అలాగే కావాలని అనుకున్నానని చెప్పాడు. 13 ఏళ్ల వయసులో మొదటిసారిగా అలంకరణలు చేశాడు. 33 ఏళ్ల గౌతమ్ దాదాపు 10 సంవత్సరాల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి తరతరాలుగా వస్తున్న ఈ వృత్తిలోకి వచ్చాడు. ఇప్పటి వరకు గౌతమ్ వేల అలంకరణలు చేశాడు. ఓపిక లేకపోతే ఈ పనిని చేయలేరని.. తాము అలంకరిస్తున్నప్పుడు దేవుడితో మమేకం అవుతామమని చెబుతున్నాడు.
"నేను విగ్రహాలను అలంకరించేటప్పుడు ఓ పద్ధతి పాటిస్తాను. మొదటగా చేతుల వద్ద స్టార్ట్ చేసి క్రమంగా ఆయుధాలను అలంకరిస్తాను. ఆ తర్వాత దుస్తులు, ఆభరణాలు అలంకరించి దేవత రూపంలోకి తీసుకొస్తాను. మనుషులు శరీరం పంచ భూతాలతో నిర్మించబడింది. కాబట్టి అలాంటి ప్రకృతి నుంచి వచ్చిన సహజమైన వస్తువులనే దేవతా అలంకరణకు ఉపయోగిస్తాను. ఇక్కడ ప్లాస్టిక్ వాడటం నిషేధం."
--గౌతమ్, పూజారి
ఇది ఉద్యోగం కాదు..
గౌతమ్ ఇక్కడే కాకుండా విదేశాల్లో కూడా దేవతా విగ్రహాలకు అలంకరణలు చేశాడు. ఓసారి అమెరికా వెళ్లినప్పుడు విగ్రహాలకు దుస్తులు కుట్టడంలో అక్కడ ఉన్న కమ్యూనిటీ సభ్యులు తనకు సహాయం చేశారని చెప్పాడు. దేవత చీరకు ఎంబ్రాయిడరీ వేశారని గుర్తుచేసుకున్నాడు. కాగా, వారంతా అక్కడికి కేవలం ఎంబ్రాయిడరీ వేయడానికి మాత్రమే రాలేదని.. దేవతపై వారికి ఉన్న భక్తి, ప్రేమను చాటుకునేందుకు వచ్చారని తెలిపాడు. ఇలా చేయడం నాకు ఉద్యోగం కాదు అని అన్నాడు. 'మీరు దీన్ని సేవ అని పిలవవచ్చు. ఎందుకంటే ఇది చాలా మందికి స్వచ్ఛమైన ఆనందాన్నిస్తుంది. మనలోని ఆధ్యాత్మికతను మేల్కొలుపుతుంది. కానీ నా దృష్టిలో, ఇది దాని కంటే ఎక్కువ. దానికి ప్రజలను మార్చే శక్తి ఉంది.' అని చెప్పాడు.