Social ostracism: స్వాతంత్ర్యం వచ్చి ఏడున్నర దశాబ్దాలు గడుస్తున్నా.. సంఘ బహిష్కరణ లాంటి సామాజిక జాఢ్యాలు ప్రజలని పట్టి పీడిస్తున్నాయి. దీని కారణంగా చాలా మంది మానసికంగా కుంగిపోతున్నారు. ఇలాంటి ఘటనలు ఇప్పటికీ తరచుగా జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తర కన్నడ జిల్లా అంకోలా తాలూకాలోని హరవాడ అనే గ్రామంలో ఇలాంటి ఘటనే జరిగింది.
అసలేమైందంటే..
హరవాడ గ్రామానికి చెందిన బంట వెంకు గౌడ 10 సంవత్సరాల క్రితం తన కుమారుడికి వివాహం చేశాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన కులపెద్ద ఆనంద సిద్ద గౌడకు.. తాంబూలం ఇవ్వలేదు. దీంతో అసహనానికి గురైన ఆనంద సిద్ద గౌడ.. కులస్థులను పిలిచి వెంకు గౌడ కుటుంబాన్ని సంఘ బహిష్కరణ చేయించాడు. బహిష్కరించిన వారికి ఎలాంటి సహయం చేయకూడదని.. నీళ్లు, నిత్యావసరాలు లాంటివి కూడా అందించరాదని ఆంక్షలు విధించారు. అప్పటి నుంచి గ్రామానికి చెందినవారెవరూ.. వెంకు గౌడ కుటుంబంతో మాట్లాడటం లేదు.
ఆనంద సిద్ద గౌడ, బంట వెంకు గౌడ కుటుంబాలు గతంలో ఉమ్మడి కుటుంబంగా ఉండేవి. రోజులు గడుస్తున్న కొద్దీ చిన్న చిన్న గొడవలు.. ఆస్తి సమస్య వరకు చేరి పెద్ద ఎత్తున గొడవకు దారితీశాయి. ఉమ్మడి కుటుంబంగా ఉన్న ఆనందగౌడ కుటుంబం విడిపోయింది. కుల పెద్దకు తాంబూలం ఇవ్వలేదనే కారణంతో తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు. ఇలాంటి పరిస్థితి ఇంకెవరికీ రాకుడదని వెంకు గౌడ భార్య కన్నీళ్లు పెట్టుకుంది.
ఈ విషయమై బంట వెంకు గౌడ కుమారుడు ఎన్ని సార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకపోయింది. బహిష్కరణతో మనస్తాపానికి గురైన వెంకు గౌడ కొన్ని సంవత్సరాల క్రితం మరణించాడు. ఆ కుటుంబంలోకి అమ్మాయి, అబ్బాయిని గాని ఇవ్వడం లేదు. దీంతో ఆ కుటుంబం చాలా ఇబ్బందులకు గురవుతోంది. బహిష్కరణ విషయం వెలుగులోకి రాగా.. అధికారులు స్పందించి ఆ కుటుంబం గురించి వివరాలు తెలుసుకున్నారు. అలాగే వెంకు కుటుంబాన్ని బహిష్కరించిన కుటుంబాల వివరాలు తెలుసుకుని వారిపై కఠినమైన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.
ఇవీ చూడండి: 119 ఏళ్ల వృద్ధుడి అంతిమయాత్రలో డీజే, ఉత్సాహంగా డ్యాన్సులు