అమ్మాయిని ఐటమ్ అని పిలిచినందుకు ముంబయిలోని ఓ యువకుడికి ఏడాదిన్నర జైలు శిక్షను విధించింది ప్రత్యేక పోక్సో కోర్టు. అమ్మాయిలను ఐటమ్ అని పిలవడం.. లైంగిక వేధింపుల కిందకే వస్తుందని ముంబయి ప్రత్యేక పోక్సో కోర్టు తీర్పునిచ్చింది. బాలికలను వేధించేవారిని వదిలేదే లేదని కోర్టు స్పష్టం చేసింది.
అసలు ఏం జరిగిందంటే.. 2015లో 16 ఏళ్ల బాలికను.. 25 ఏళ్ల యువకుడు తనను లైంగికంగా వేధించాడని కేసు నమోదు చేసింది. అయితే.. ముంబయి ప్రత్యేక పోక్సో కోర్టు ఈ కేసుపై గురువారం విచారణ చేపట్టింది. జూలై 14, 2015న స్కూల్ నుంచి ఇంటికి వస్తున్న తనను ఓ యువకుడు బైక్‌పై వెంబడించాడని.. తన జుట్టు పట్టుకుని లాగుతూ.. 'ఐటమ్' అని పిలిచినట్లు బాలిక కోర్టులో తెలిపింది. ఈ విషయంపై స్పందించిన ప్రత్యేక పోక్సో కోర్టు.. అబ్బాయిలు ఉద్దేశ పూర్వకంగానే అమ్మాయిలను లైంగికంగా వేధించడానికే అలా పిలుస్తారని తెలిపింది. ఇలాంటి నేరాలను కఠినంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని.. రోడ్‌సైడ్ రోమియోలకు సరైన గుణపాఠం చెప్పాల్సిందేనని కోర్టు వ్యాఖ్యానించింది. నిందితుడి విషయంలో కనికరం చూపే ప్రసక్తే లేదని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌జే అన్సారీ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.