Ayodhya Ram statue height : ఉత్తర్‌ప్రదేశ్ అయోధ్యలో ఏర్పాటు కానున్న 251 మీటర్ల శ్రీరాముడి ప్రతిమ.. ప్రపంచంలోనే అత్యంత విగ్రహం కానుంది. రామజన్మభూమిలో కొత్తగా నిర్మితమవుతున్న రామాలయం దర్శనానికి వచ్చే వారిని మంత్రముగ్ధుల్ని చేయనుంది. గుజరాత్ కేవడియాలోని సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహం రూపశిల్పి, పద్మభూషణ్ గ్రహీత రామ్.వి.సుతార్.. రాముడి ప్రతిమ సృష్టికీ సారథ్యం వహించనున్నారు. లతా మంగేష్కర్ చౌక్ అభివృద్ధి పనుల కోసం.. కుమారుడు అనిల్‌తో కలిసి ప్రస్తుతం అయోధ్యలో ఉన్న సుతార్‌తో ఈటీవీ భారత్ ప్రత్యేకంగా మాట్లాడింది.
రామ్.వి.సుతార్ చెప్పినదాని ప్రకారం.. అయోధ్యలో ఏర్పాటు కానున్న రాముడి విగ్రహం 251 మీటర్లు ఎత్తు ఉండనుంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహంగా ఉన్న పటేల్ 'స్టాచ్యూ ఆఫ్ యూనిటీ'(182 మీటర్లు) కన్నా ఇది 69 మీటర్లు పెద్దది.
సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహం రూపకల్పన కోసం 1000 మంది శిల్పులు మూడున్నర ఏళ్లపాటు శ్రమించారు. అయోధ్యలోని రాముడి ప్రతిమ కోసం 2వేల మంది దాదాపు నాలుగేళ్ల పనిచేయాల్సి ఉంటుందని అంచనా వేశారు రామ్ సుతార్ కుమారుడు అనిల్ సుతార్. సాహిబాబాద్‌లోని తమ కార్ఖానాలో విగ్రహం తయారీ పనులు చేపడతామని వెల్లడించారు.
రాముడి విగ్రహం ఏర్పాటుకు 2018లోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది. సుతార్ బృందం రూపొందించిన మోడల్‌ను ఆమోదించింది. అయోధ్యలో విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయించి, భూమి కొనుగోలు ప్రక్రియ పూర్తికాగానే.. శంకుస్థాపన చేసి, నాలుగేళ్లలో నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు అనిల్.
మరోవైపు.. ముంబయిలో 212 మీటర్లు ఎత్తయిన ఛత్రపతి శివాజీ విగ్రహం, 137.2 మీటర్ల అంబేడ్కర్ ప్రతిమ; కర్ణాటకలో 46.6 మీటర్ల శివుడి విగ్రహానికి సంబంధించిన ప్రాజెక్టులపైనా సుతార్ బృందం పనిచేస్తోంది.