Delhi Heavy Rain : దేశ రాజధాని దిల్లీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. శనివారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో నగర వీధులు చెరువులను తలపిస్తున్నాయి. ట్రాఫిక్ స్తంభించిపోయింది. సాధారణంగా అక్టోబరులో దిల్లీలో ఈ స్థాయిలో వర్షాలు కురవడం చాలా అరుదు. శీతాకాలం ప్రారంభమయ్యే ఈ సమయంలో అక్కడ ఏటా గాలి నాణ్యత క్షీణించడం మొదలవుతుంది. శివారు ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనం కూడా ఇదే నెల నుంచి ఆరంభిస్తారు. అయితే, తాజాగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల గాలి నాణ్యత కొంత మెరుగవుతుందని వాతావరణ నిపుణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
గత 24 గంటల్లో దిల్లీలో కురిసిన వర్షపాతం రికార్డు నెలకొల్పిందని ప్రైవేటు వాతావరణ సంస్థ స్కైమెట్ ఉపాధ్యక్షుడు మహేశ్ పలావట్ తెలిపారు. గత దశాబ్దకాలంలో దిల్లీలో అక్టోబరులో ఈ స్థాయి వర్షాలు ఎప్పుడూ కురవలేదన్నారు. శనివారం నుంచి ఇప్పటి వరకు 74 ఎంఎం వర్షపాతం నమోదైందన్నారు. ఉష్ణోగ్రతలు సైతం 10 డిగ్రీల మేర పడిపోయాయన్నారు. సోమవారం నాటికి వర్షాలు తగ్గుముఖం పడతాయన్నారు. దిల్లీతో పాటు శివారు ప్రాంతాల్లోని ఫరీదాబాద్, గురుగ్రామ్, నోయిడాలోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
ఇవీ చదవండి: లైవ్ వీడియో.. వరదలో బస్సు బోల్తా.. లక్కీగా 50 మంది..