సామాజిక మాధ్యమాల్లో ప్రచారమవుతున్న నకిలీ వార్తలపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని సాధారణ మీడియాలలో వస్తున్న వార్తలు సైతం మతపరమైన స్వభావాన్ని(Communal Tone) కలిగి ఉంటున్నాయని వ్యాఖ్యానించింది. ఇలాంటివి దేశానికి చెడ్డపేరు తీసుకొస్తాయని నిజాముద్దీన్ మర్కజ్ వద్ద మతపరమైన సమావేశాలపై పలు ఛానెళ్లలో వచ్చిన నకిలీ వార్తలను అడ్డుకోవాలంటూ జమైత్ ఉలేమా-ఇ-హింద్ దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది.
"నియంత్రణ వ్యవస్థ లేక వ్యక్తుల పరువుకు నష్టం జరుగుతోంది. కంటెంట్ విషయంలో సోషల్ మీడియా, వెబ్‌పోర్టళ్లలో జవాబుదారీతనం కనిపించట్లేదు. దేశంలో ప్రతి విషయాన్ని మత కోణంలో చూపుతున్నారు. దీనివల్ల దుష్ప్రభావం తలెత్తుతోంది. వెబ్ పోర్టళ్లు దేన్నయినా ప్రచురించగలుగుతున్నాయి. ఎవరైనా యూట్యూబ్ ఛానల్ ప్రారంభించే అవకాశం ఉంది. వ్యవస్థలకు కూడా సోషల్ మీడియా వేదికలు స్పందించట్లేదు. బలవంతులకే స్పందిస్తాయి. కొన్ని ప్రైవేటు ఛానెళ్లలో వస్తున్న వార్తలు సైతం మతపరమైన స్వభావాన్ని కలిగి ఉంటున్నాయి. అంతిమంగా ఇది దేశానికి చెడ్డపేరు తీసుకొస్తుంది. వీటిని నియంత్రించేందుకు మీరు(కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి) ఎప్పుడైనా ప్రయత్నించారా?"
-జస్టిస్ ఎన్వీ రమణ
ఈ అంశంపై వివిధ హైకోర్టులలో దాఖలైన కేసులన్నింటినీ సుప్రీంకు బదిలీ చేయాలన్న కేంద్రం అభ్యర్థనకు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆరు వారాల తర్వాత మళ్లీ విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది.
ఇదీ చదవండి: సర్కారు మారితే రాజద్రోహం కేసులా!