Satyendar Jain news : అనారోగ్యంతో బాధపడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సత్యేందర్ జైన్‌కు సుప్రీంకోర్టు ఊరట కల్పించింది. మనీలాండరింగ్ కేసులో అరెస్టై తిహాడ్ జైలులో ఉంటున్న సత్యేందర్‌కు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వైద్యపరమైన కారణాలతో షరతులతో కూడిన బెయిల్ ఇస్తున్నట్లు తెలిపింది. అనుమతి లేకుండా దిల్లీని దాటి వెళ్లకూడదని స్పష్టం చేసింది. మీడియా ముందు ఎలాంటి ప్రకటనలు చేయొద్దని ఆదేశించింది. వైద్య సమస్యలతో బాధపడుతున్న సత్యేందర్ జైన్.. నచ్చిన ఆస్పత్రిలో చికిత్స తీసుకోవచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. మెడికల్ రికార్డులను సమర్పించాలని ఆదేశించింది.
'పరీక్షలు అక్కడే చేయించండి'
సత్యేందర్ జైన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. గత కొంతకాలంగా జైలులో ఉంటున్న సత్యేందర్ జైన్.. 35 కేజీల బరువు తగ్గారని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వెన్నెముక సమస్యతోనూ ఆయన బాధపడుతున్నారని సింఘ్వి వివరించారు. ఈడీ తరఫున వాదించిన అదనపు సొలిసిటర్ జనరల్ జీఎస్వీ రాజు.. జైన్‌కు ఎయిమ్స్ లేదా రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రి వైద్యుల బృందంతో పరీక్షలు చేయించాలన్నారు. చికిత్స అవసరమని వైద్యులు చెబితే.. దాన్ని ఈడీ వ్యతిరేకించదని అన్నారు. అయితే, పరీక్షల విషయాన్ని తదుపరి విచారణలో తేల్చుతామని సుప్రీంకోర్టు పేర్కొంది. ప్రస్తుతానికి బెయిల్ మంజూరు చేస్తున్నట్లు తెలిపింది.
బాత్రూంలో పడిపోయి..
సత్యేందర్ జైన్ గురువారం తిహాడ్ జైలులోని బాత్రూంలో పడిపోయారు. మొదట ఆయన్ను దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రికి తరలించారు. ఊపిరి తీసుకోవడంలో సమస్య ఏర్పడటం వల్ల ఆయన్ను లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయన ఆరోగ్యం విషమించిందని, ప్రస్తుతం ఐసీయూలో చికిత్స అందిస్తున్నారని ఆప్ వర్గాలు తెలిపాయి. వైద్యులు నిరంతరం ఆయన పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారని తెలిపాయి.
సీబీఐ, ఈడీ కేసులు
అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన కేసులో సత్యేందర్ జైన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై సీబీఐ 2017లో ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సీబీఐ కేసులో ఆయనకు 2019 సెప్టెంబర్ 6న ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే, సీబీఐ కేసు ఆధారంగా ఈడీ సైతం ఆయనపై కేసు నమోదు చేసింది. జైన్‌కు చెందిన నాలుగు కంపెనీలలో మనీలాండరింగ్ జరిగినట్లు ఈడీ ఆరోపిస్తోంది. ఈ కేసులో జైన్‌ను గతేడాది మే 30న అరెస్ట్ చేసింది. అప్పటి నుంచి ఆయన తిహాడ్ జైలులోనే ఉంటున్నారు. జైలులో ఆయనకు సపర్యలు చేస్తున్న పలు వీడియోలు బయటకు రావడం గతంలో సంచలనమైంది. ఆ వీడియోల కోసం కింది లింక్‌లపై క్లిక్ చేయండి.