Sanjay Raut ED : శివసేన(ఉద్ధవ్ వర్గం) కీలక నేత సంజయ్ రౌత్‌కు ఊరట లభించింది. పాత్రచాల్ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న ముంబయిలోని స్పెషల్ కోర్టు జడ్జి ఎంజీ దేశ్‌పాండే.. రౌత్‌కు బెయిల్ మంజూరు చేశారు. దీంతో బుధవారం సాయంత్రం ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఆర్థర్ రోడ్ జైలు నుంచి బయటకు వచ్చిన ఆయన.. తన అనుచరులకు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేశారు.
అంతకుముందు, సంజయ్ రౌత్ విడుదలను అడ్డుకోవాలంటూ ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు తోసిపుచ్చింది. కింది కోర్టు ఇచ్చిన బెయిల్‌పై స్టే విధించాలని ఈడీ కోరగా.. ఇరుపక్షాల వాదనలు వినకుండా అలాంటి ఆదేశాలు ఇవ్వలేమని బాంబే హైకోర్టు పేర్కొంది. దీనిపై విచారణను గురువారానికి వాయిదా వేసింది.
పాత్రాచాల్ కేసులో సంజయ్ రౌత్‌ను జులై 31న అరెస్టు చేసింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. అప్పటి నుంచి ఆయన జైలులోనే ఉన్నారు. అరెస్ట్‌కు ముందు రౌత్ ఇంట్లో 9 గంటల పాటు సోదాలు నిర్వహించిన దర్యాప్తు సంస్థ అధికారులు రూ.11.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అందులో రూ.10 లక్షలు ప్రత్యేక కవర్‌లో ఉన్నట్లు సమాచారం. ఇంట్లో సోదాల తర్వాత ముంబయిలోని ఈడీ జోనల్ కార్యాలయంలో ఆయన్ను ఆరు గంటల పాటు ప్రశ్నించారు. ఆయన్ను కార్యాలయానికి తరలించేటప్పుడు కొన్ని ఉద్వేగభరిత దృశ్యాలు కనిపించాయి. బయటకు వెళ్తుండగా రౌత్ తల్లి ఆయనకు హారతి ఇచ్చి తిలకం దిద్దారు. ఆయనేమో తల్లి పాదాలకు నమస్కరించి, ఆమెను ఆలింగనం చేసుకున్నారు.
ఇదీ కేసు
పాత్రాచాల్ భూకుంభకోణంతో సంజయ్ రౌత్, ఆయన సతీమణి వర్షా రౌత్ సహా మరికొంతమందికి సంబంధం ఉందన్నది ప్రధాన ఆరోపణ. ఈ క్రమంలోనే వర్షా రౌత్‌కు చెందిన రూ.11.15 కోట్ల విలువచేసే ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఆయన సన్నిహితులకు సంబంధించిన ఆస్తులను కూడా విచారణ సంస్థ జప్తు చేసింది. రూ.1,034 కోట్ల విలువైన ఈ కుంభకోణం కేసుకు సంబంధించి రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది.
ఇవీ చదవండి: 'నన్ను ఆ పదవి నుంచి తప్పించడంపై బాధలేదు.. భాజపా కార్యకర్తగా గర్విస్తున్నా'
'మాటలతో కాదు.. పని తీరుతోనే విశ్వాసం కల్పిస్తా'.. సీజేఐగా జస్టిస్ చంద్రచూడ్ ప్రమాణం