Indian student killed in Ukraine: ఉక్రెయిన్- రష్యా మధ్య జరుగుతున్న భీకర యుద్ధంలో ఓ భారతీయ విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగశాఖ వెల్లడించింది. ఖార్కీవ్ ప్రాంతంలో ఇరుదేశాల సైనికుల మధ్య జరిగిన పేలుళ్లలో విద్యార్థి ప్రాణాలు కోల్పోయినట్లు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందర్ బాగ్చి తెలిపారు.
Russia Ukraine war:
మృతి చెందిన విద్యార్థిని కర్ణాటక హవేరి జిల్లాకు చెందిన నవీన్ జ్ఞానగౌడార్గా గుర్తించారు. సదరు విద్యార్థి ఉక్రెయిన్‌లో వైద్య విద్య నాలుగో సంవత్సరం చదువుతున్నట్లు బాగ్చి వెల్లడించారు. నిత్యావసరాల కోసం దుకాణానికి వెళ్లిన సమయంలో.. సైనిక దళాల షెల్లింగ్‌లో యువకుడు ప్రాణాలు కోల్పోయాడని చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులతో తాము టచ్‌లో ఉన్నామని స్పష్టం చేశారు. వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఖార్కీవ్లో అనేక మంది భారత పౌరులు చిక్కుకునే ఉన్నారని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భారతీయులను సురక్షితంగా తీసుకొచ్చే విషయంపై రష్యా, ఉక్రెయిన్ రాయబారులతో విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడారు. ఘర్షణాత్మక ప్రాంతాల్లోని భారతీయులను తరలించేందుకు రష్యా, ఉక్రెయిన్ సాయం చేయాలని భారత్ డిమాండ్ చేసినట్లు అధికారులు తెలిపారు. ఘర్షణ లేని ప్రదేశాల్లోని పౌరులను సొంతంగా తరలించిన విషయాన్ని గుర్తు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు 9 వేల మంది భారత పౌరులు ఉక్రెయిన్ నుంచి బయటకు వచ్చారని, అనేక మంది సురక్షిత ప్రాంతాల్లోనే ఉన్నారని స్పష్టం చేశారు. పౌరుల తరలింపుపై రష్యా, ఉక్రెయిన్ దేశాల్లోని భారత రాయబారులు ముమ్మర చర్యలు తీసుకుంటున్నట్లు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
తండ్రి సంచలన ఆరోపణలు..
అయితే, ఉక్రెయిన్‌లో చిక్కుకున్నవారికి అధికారుల నుంచి సహకారం అందలేదని మృతుడి తండ్రి శేఖరగౌడ ఆరోపించారు. ఉక్రెయిన్‌లోని భారత రాయబార కార్యాలయానికి చెందిన అధికారులెవరూ విద్యార్థులను కలిసేందుకు ప్రయత్నించడం లేదని అన్నారు.
ఖార్కివ్‌లోని ఓ బంకర్లో నవీన్‌తో పాటు అతడి స్నేహితులు తలదాచుకున్నారని మృతుడి మామ ఉజ్జయనగౌడ వెల్లడించారు. మంగళవారం ఉదయం తన తండ్రికి నవీన్ ఫోన్ చేశాడు. బంకర్లో ఆహారం, నీళ్లు అందుబాటులో లేవని చెప్పాడు. కరెన్సీ ఎక్స్ఛేంజీ చేసుకొని, ఆహారాన్ని కొనుక్కునేందుకు బంకర్ నుంచి నవీన్ బయటకు వెళ్లాడు. అదే సమయంలో షెల్లింగులతో దాడులు జరిగాయి. దీంతో నవీన్ అక్కడికక్కడే మరణించాడు' అని ఉజ్జయనగౌడ వివరించారు.
మోదీ, బొమ్మై విచారం
కాగా, ఈ నేపథ్యంలో నవీన్ తండ్రితో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడారు. శేఖరగౌడకు ఫోన్ చేసిన మోదీ.. యువకుడి మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తన కుమారుడి మృతదేహాన్ని తిరిగి తీసుకురావాలని నవీన్ తండ్రి శేఖరగౌడ.. మోదీకి విజ్ఞప్తి చేశారు.
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై సైతం శేఖరగౌడకు ఫోన్ చేశారు. నవీన్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నవీన్ భౌతికకాయాన్ని భారత్‌కు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: ఆస్పత్రిలో పేలుడు.. అనేక మందికి గాయాలు