Rohtak ATM robbery: హరియాణాలోని రోహ్తక్లో దొంగలు రెచ్చిపోయారు. పట్టపగలే ఏటీఎం క్యాష్ వ్యాన్‌ను దోచుకున్నారు. వ్యాన్ గార్డుపై దాడి చేసి.. రూ.2.62 కోట్లతో పరారయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటలకు ఈ ఘటన జరిగింది. మధ్యాహ్నం సమయంలో ఏటీఎం క్యాష్ వ్యాన్ సెక్టార్ 1 మార్కెట్ వద్దకు చేరుకుంది. అక్కడ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకుల ఏటీఎం యంత్రాలలో సిబ్బంది డబ్బులు నింపుతున్నారు. సరిగ్గా అదే సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు రమేశ్ అనే సెక్యూరిటీ గార్డును వెనక నుంచి కాల్చారు. ఈ ఘటన తాలూకు దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
కాల్పులు జరగగానే.. ఏటీఎంలలో నగదు నింపుతున్న సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. దుండగులకు భయపడి అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోయారు. దీంతో దొంగల పని సులభమైంది. నగదు పెట్టల్లో నుంచి రూ.2.62 కోట్లను తీసుకొని దుండగులు పరారయ్యారు. ఏటీఎం యంత్రాలలో నింపేందుకు మొత్తం రూ.2.92 కోట్లను తీసుకొచ్చామని సిబ్బంది తెలిపారు. గాయపడ్డ సెక్యూరిటీ గార్డు రమేశ్‌ను పీజీఐఎంఎస్ ఆస్పత్రిలో చేర్పించారు. అతడికి ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది.
ఘటన జరిగిన తర్వాత పోలీసులు రంగంలోకి దిగారు. జిల్లా ఎస్పీ ఉదయ్ వీర్ సింగ్ నేరుగా వచ్చి ఘటనా స్థలిని పరిశీలించారు. భారీ సంఖ్యలో పోలీసులు ఏటీఎంల వద్ద మోహరించారు. నిందితులు పక్కా ప్రణాళికతో ఈ దొంగతనం చేశారని ఉదయ్ సింగ్ తెలిపారు. ఏటీఎం వద్ద రెక్కీ నిర్వహించారని తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని వెల్లడించారు. వారు ఉపయోగించిన బైక్ నెంబర్‌ను గుర్తించినట్లు స్పష్టం చేశారు. త్వరలోనే వారిని అదుపులోకి తీసుకుంటామని అన్నారు.
ఇదీ చదవండి: బూస్టర్ క్షిపణి పరీక్ష సక్సెస్.. శత్రు యుద్ధవిమానాలకు చుక్కలే!